
''కులం'' మీద పవన్ కల్యాణ్ అభిప్రాయం ఇదీ??
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించడానికి వచ్చిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు ఉన్న తేడాను స్పష్టంగా చెప్పారు. తెలంగాణ ప్రజలు ''నా తెలంగాణ'' అంటూ రాష్ట్రం గురించి ఆలోచిస్తున్నారని, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం ''నా కులం'' అంటూ కులం గురించి ఆలోచిస్తున్నారన్నారు.
ఈ రకమైన ఆలోచనలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో కాకుండా తిరోగమనంలోకి నెట్టేసుకుంటున్నామని, వైసీపీ లాంటి పార్టీలకు పట్టం కడుతున్నామన్నారు. అన్ని కులాల ప్రజలు కలిస్తేనే జనసేన అనే వేదిక ఉంటుందని, తన పార్టీ ఏ కులానికి సంబంధించింది కాదని స్పష్టం చేశారు. తాను ఒక్కటే చెబుతున్నానని, ఎవరి కులాన్ని వారు గౌరవించుకోవాలని, కానీ ఆ కులం, మతం పరిధి దాటి ఆలోచించకపోతే మన భవిష్యత్తును మనమే పాడుచేసుకున్నవారిమవుతామని హెచ్చరించారు.

సాయం చేసిన వ్యక్తి భగవంతుడితో సమానమని, అలా కాకుండా నా కులం, నా మతం అని ఆలోచిస్తే మన జీవితాల్లో మార్పు రాదన్నారు. దళిత కులానికి చెందిన డ్రైవర్ సుబ్రమణ్యంను వైసీపీ ఎమ్మెల్సీ హత్య చేస్తే.. అప్పుడు కోనసీమ జిల్లాకు అంబేద్కర్ అనే పేరు పెట్టారని, జిల్లాలకు ఎన్టీఆర్, శ్రీసత్యసాయి అనే పేర్లు పెట్టేటప్పుడు అంబేద్కర్ గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్, పొట్టి శ్రీరాములు, మహాత్మా గాంధీజీ, నేతాజీ సుభాష్‌చంద్రబోస్ లాంటి గొప్ప వ్యక్తులకు కులాన్ని ఆపాదించవద్దని తీర్మానం చేస్తున్నట్లు పవన్ ప్రకటించారు.