'నాతోపాటు మీరు కూడా ఉంటే టార్గెట్ గట్టిగా కొట్టొచ్చు!?'
వచ్చే ఎన్నికల కోసం జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ లోతైన వ్యూహాన్ని, దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించుకున్నారు. నిన్నటివరకు జనసేన పార్టీయేకదా ఏముందిలే అన్నవారికి గట్టి సమాధానం చెప్పాలనే దృఢనిశ్చయంతో పవన్ ఉన్నారు. పార్టీకి పునాదులు లేవు అన్నవారికి జనసేన బలమైన పునాదులను చూపించాలని, పార్టీకి కార్యకర్తల బలం లేదన్నవారికి అభిమానులనే కార్యకర్తలుగా మరల్చుకొని జనసేన ప్రభావం ఎన్నికలను ఎలా మార్చబోతుందో చూడండి అనే రీతిలో పవన్ కార్యకలాపాలుంటున్నాయి.

25 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయం..
గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుంచి రెండుస్థానాల్లో ఓటమిపాలైనప్పటికీ, రాజోలు నుంచి గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే వైసీపీలో చేరినప్పటికీ ఆయన వెనుకంజ వేయడంలేదు. 25 సంవత్సరాలు తాను రాజకీయం చేయడానికే వచ్చానని, అవసరమైతే అంతకాలం ఓర్పుగా ఎదురుచూసే నేర్పు తన దగ్గరుందనే విషయాన్ని విశ్లేషకులకు అర్థమయ్యేలా చెబుతున్నారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో జనసేన తరఫున అసెంబ్లీలో 20 నుంచి 25 మందివరకు ప్రాతినిధ్యం ఉండాలన్నదే టార్గెట్ గా పెట్టుకున్నారు.

తనతోపాటు మరో 25 మంది సైన్యం ఉంటే..
ఎటువంటి ముందస్తు వ్యూహం లేకుండా సరాసరిగా వచ్చి ఎన్నికల్లో పోటీచేయడంవల్ల రెండు నియోజకవర్గాల్లో ఓటమిపాలైనట్లు జనసేనాని గుర్తించారు. ఈసారి అలా కాకుండా ఒకే నియోజకవర్గం నుంచి పోటీచేయాలంటూ.. అందుకుతగ్గ సన్నాహాలను ఇప్పటినుంచే సిద్ధం చేసుకుంటున్నారు. 2024 కాకపోతే 2029 ఉంది.. సుదీర్ఘకాలం నేను పోరాటం చేయడానికి సిద్ధపడ్డాను అంటే అందరూ తేలిగ్గా చూశారు. కానీ ఇప్పుడు పవన్ కల్యాణ్ వ్యూహం తెలిసి ఔరా అంటున్నారు. రానున్న ఎన్నికల్లో తాను అసెంబ్లీలో అడుగుపెట్టడంతోపాటు మరో 20 నుంచి 25 మంది ఎమ్మెల్యేల సైన్యాన్ని అసెంబ్లీలోకి తీసుకువెళ్లగలిగితే 2029లో అధికారం సులువుగా దక్కుతుందనే యోచనలో ఉన్నారు. అందుకు తగ్గట్లుగా ప్రణాళికలు రచించుకుంటున్నారు.

అభిమానులను ఓటర్లుగా మలచుకోవాలి
ముఖ్యంగా తనకు పట్టున్న ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, విజయనగరంతోపాటు కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఉన్న తన అభిమాన గణాన్ని ఓటర్లుగా మార్పుచేసేందుకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో ప్రస్తుతం నడుస్తున్న పాలనపై అభిమానులకు వివరించనున్నారు. గత ఎన్నికల్లో కూడా సభలకు, సమావేశాలకు అభిమానులు తండోప తండాలుగా తరలివచ్చినప్పటికీ అవి ఓట్లరూపంలో మారలేదు. కానీ ఈసారి తన అభిమానులను జనసేన ఓటర్లుగా మార్చుకోగలగిగితే తాననుకుంటున్న స్వల్పకాలిక లక్ష్యం 2024, దీర్ఘకాలిక లక్ష్యం 2029 సులువుగా చేరగలననే నమ్మకంతో జనసేనాని పవన్ కల్యాణ్ ఉన్నారు.












Click it and Unblock the Notifications