పవన్ కల్యాణ్ అనూహ్య నిర్ణయం!!
ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయ వాతావరణం పూర్తిగా వేడెక్కింది. ముఖ్యమంత్రి జగన్ తన టీమ్ ను సిద్ధం చేసుకుంటున్నారు. ఏ క్షణంలోనైనా ముందస్తు రావచ్చని వార్తలు వస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం, జనసేన పార్టీలు కూడా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కోవడానికి తమ యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్నాయి. .

వాహనానికి అనుమతిచ్చేది లేదు
గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో వైసీపీ, బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ పేరుతో తెలుగుదేశం పార్టీ తమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళుతున్నాయి. చంద్రబాబు తనయుడు లోకేష్ జనవరి 27వ తేదీ నుంచి పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే జనసేనాని పవన్ కల్యాణ్ కూడా బస్సు యాత్రకు సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి వాహనాన్ని పవన్ సోషల్ మీడియాద్వారా ప్రజలకు పరిచయం చేశారు. దీనికి వేసిన రంగుపై జనసేన, వైసీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ వాహనానికి అనుమతివ్వమని మాజీ మంత్రి పేర్ని నాని ప్రకటించారు.

సందిగ్ధంలో పడిన పొత్తుపొడుపు
వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనే విషయం జనసేనలో ఇంకా ఖరారవలేదు. తెలుగుదేశం పార్టీతో పొత్తుతో వెళ్లే అవకాశాలున్నాయని చెబుతున్నప్పటికీ బీజేపీని కూడా కలుపుకొని వెళ్లాలనేది పవన్ యోచనగా ఉంది. అయితే విశాఖలో ప్రధాని మోడీ ఇచ్చిన రోడ్ మ్యాప్ తో టీడీపీ, జనసేన పొత్తుకు సంబంధించిన విషయం సందిగ్ధంలో పడింది. ఇదిలా ఉండగానే తన ఎన్నికల వ్యూహాన్ని పవన్ పూర్తిగా మార్చేశారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉండే పక్షంలో ఎమ్మెల్యేగా పోటీచేయడానికి ప్రయత్నిస్తున్నారు.

అనంతపురం నుంచి ఎంపీగా పోటీచేస్తే..
అలా కాకుండా కేంద్ర రాజకీయాలవైపు వెళ్లాలనుకుంటే ఎంపీగా పోటీచేద్దామనే ఆలోచనలో ఉన్నట్లు జనసేన వర్గాలు వెల్లడించాయి. నియోజకవర్గాలు ఖరారైనప్పటికీ బయటకు వెల్లడి చేయడంలేదు. ఎమ్మెల్యేగా గెలిస్తే చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారు. అందులో డిప్యూటీ పదవి తీసుకోవడం ఒక ఆప్షన్ గా ఉంది. అలాకాకుండా ఎంపీగా పోటీచేసి కేంద్రంలో మంత్రిగా ఉండాలని, రాష్ట్రంలో చంద్రబాబు, కేంద్రంలో పవన్ కల్యాణ్ కలిసి రాష్ట్రాన్ని పూర్తిగా అభివృద్ధి పథంలో పయనింపచేయాలనేది ఒక ఆలోచనగా ఉన్నట్లు రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. ఎంపీగా పోటీచేయాలనే అనూహ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటే అప్పుడు నియోజకవర్గాన్ని ప్రకటిస్తారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి ఉమ్మడి అనంతపురం నుంచి ఎంపీగా పోటీచేయాలనుకుంటున్నారు. ఎమ్మెల్యేగా అయితే ఉమ్మడి తూర్పుగోదావరిలోని పిఠాపురమని వార్తలు వస్తున్నాయి. వీటిని జనసేన వర్గాలు కూడా ఖండించడంలేదు. ముందుగా ఈ నియోజకవర్గాల్లో సర్వే చేయించుకొని గెలుపు అవకాశాలు కచ్చితంగా ఉంటాయని ధ్రువీకరించుకున్న తర్వాతే బయటకు ప్రకటించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications