ఆ నియోజకవర్గంలో బాక్సు బద్ధలవ్వాలంటున్న పవన్ కల్యాణ్!
గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం నియోజకవర్గాల నుంచి పోటీచేసిన జనసేనాని పవన్ కల్యాణ్ రెండుచోట్లా ఓటమిపాలయ్యారు. జనసేన పార్టీ అధినేతగా రెండు నియోజకవర్గాల్లోను విజయం సాధిస్తారని అంచనా వేసినప్పటికీ పవన్ కు నిరాశ తప్పలేదు. సరైన పోల్ మేనేజ్ మెంట్ లేకుండా చివరి నిముషంలో నేరుగా బరిలోకి దిగడం ఓటమికి కారణమని విశ్లేషకులు అంచనా వేశారు.

ఒక నియోజకవర్గం చాలు..
గత ఎన్నికలకు భిన్నంగా రెండు నియోజకవర్గాల నుంచి పోటీపడటం కాకుండా తనకు బలమున్న జిల్లాలో, తనకు బలమున్న నియోజకవర్గంలో ఒక్కదాని నుంచే పోటీచేయాలని పవర్ స్టార్ యోచిస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వానికి పూర్తిస్థాయి ప్రత్యర్థిగా మారిన పవన్ కల్యాణ్ ను ఈసారి ఎన్నికల్లో కూడా ఓడించి తీరతామని వైసీపీ మంత్రులు, ఇతర నాయకులు ప్రకటిస్తున్నారు. అయితే పవన్ ఏ నియోజకవర్గం నుంచి పోటీచేసినా గెలిపించుకుతీరతామని జనసైనికులు ప్రకటిస్తున్నారు. గాజువాకలో గత ఎన్నికల్లో పవన్ కు 56,125 ఓట్లు వచ్చాయి.

గాజువాక నుంచే బరిలోకి దిగితే..
అయితే అక్కడి నుంచి వైసీపీ తరఫున బరిలోకి దిగిన తిప్పల నాగిరెడ్డి తనకు ఇదే చివర ఎన్నిక అని, ఒక్క అవకాశం ఇవ్వాలంటూ కోరడంతో కొందరు ఓటర్లు అటువైపు మొగ్గుచూపారు. దీంతో జనసేన ఓటింగ్ శాతం తగ్గింది. సామాజికవర్గ బలం, అభిమాన బలం ఉన్న గాజువాక నుంచే ఈసారి పోటీకి దిగాలని జనసేనాని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
తెలుగుదేశం పార్టీతో పొత్తుండటం దాదాపుగా ఖాయమైన నేపథ్యంలో టీడీపీ బలంతోపాటు అభిమానుల బలం కలిసివచ్చి కచ్చితంగా విజయం సాధించే అవకాశాలున్నాయని సీనియర్ రాజకీయవేత్తలు సైతం తమ అభిప్రాయాలను వెల్లడిచేస్తున్నారు. గాజువాకలో ఓటింగ్ శాతం 30గా నమోదైంది.

విశాఖలో రాజకీయం.. రసవత్తరం
వైసీపీకి 38 శాతంతో 74వేలకు పైగా ఓట్లు, తెలుగుదేశం పార్టీకి 26 శాతం షేర్ తో 54వేలకు పైగా ఓట్లు లభించాయి. టీడీపీ, జనసేనను కలిపితే 56 శాతం ఓటింగ్ ఉంది. ఓట్లు కూడా లక్షకు పైగా నమోదయ్యాయి. ఈసారి కలిసి పోటీచేస్తే విజయం ఖాయమనే అంచనాలో ఉన్నారు. వైసీపీలో ఇక్కడి నుంచి టికెట్ కోసం ఇద్దరికి మించి పోటీపడుతుండటం కూడా జనసేనానికి కలిసివచ్చే అవకాశంగా భావిస్తున్నారు. గత ఎన్నికల్లో పవన్ కు జరిగిన పరాభవాన్ని ఈసారి పునరావృతం కానివ్వబోమని జనసైనికులు పట్టుదలగా ఉన్నారు.
ఇటీవలే విశాఖలో జరిగిన పరిణామాలు, ఉత్తరాంధ్రలో జరుగుతున్న పరిణామాలు పవన్ కల్యాణ్ ను బలోపేతం చేస్తున్నాయని, రాజకీయంగా ఆయన ఇమేజ్ పెరిగిందని అంచనా వేస్తున్నారు. విశాఖ నుంచి పోటీచేస్తే ఉత్తరాంధ్ర మొత్తం ప్రభావం చూపగలుగుతారని, దీనిద్వారా విజయావకాశాలు కూడా మరింత మెరుగుపడతాయనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. విశాఖలో వైసీపీ మూడురాజధానుల ప్రకటనద్వారా బలం పెంచుకోవాలనుకుంటోందని, ఈ పరిణామాల నేపథ్యంలో పవన్ కల్యాణ్ ఇక్కడి నుంచే బరిలోకి దిగితే రాజకీయం మరింత రసవత్తరంగా మారుతుంది.












Click it and Unblock the Notifications