పవన్ కల్యాణ్ కు బిగ్ రిలీఫ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు భారీ ఊరట దక్కింది. పిఠాపురంలో రోడ్ షోకు అధికారులు పచ్చజెండా ఊపారు. ఈ నెల 10న పిఠాపురంలో పవన్ కళ్యాణ్ రోడ్ షో నిర్వహించాలని జనసేన ప్రణాళిక రూపొందించుకుంది. అనుమతివ్వాలంటూ రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. అయితే అనుమతిచ్చే విషయమై అధికారులు ఎటువంటి సమాధానం చెప్పలేదు. మంగళవారం సాయంత్రం వరకు దీనిపై స్పష్టత రాలేదు. ఎట్టకేలకు బుధవారం సాయంత్రం రోడ్ షోకు అమనుతిస్తున్నట్లు కూటమి నేతలకు సమాచారం ఇచ్చారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈనెల 10వ తేదీన పిఠాపురంలో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. అందుకే జనసేనకు అనుమతిచ్చే విషయంలో జాప్యం జరిగింది. అదేరోజు వైసీపీ సభ, జనసేన రోడ్ షో ఉంటే ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తుందని పోలీసులు భావించారు. చివరకు వైసీపీ సభను వాయిదా వేసినట్లు సమాచారం రావడంతో జనసేనకు అనుమతిచ్చారు. 10వ తేదీన ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు రోడ్ షో నిర్వహిస్తారు.

పిఠాపురం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన పవన్ కల్యాణ్ ను ఎట్టి పరిస్థితుల్లోను ఓడించాలనే లక్ష్యంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉంది. అందుకోసం నియోజకవర్గం మొత్తం చతురంగ బలాలను మొహరించింది. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి నియోజకవర్గ బాధ్యతలు అప్పజెప్పింది.
పోలింగ్ తేదీకి ఒకటి, రెండు రోజుల ముందు నియోజకవర్గంలో డబ్బులు ఏరులా పారతాయని అంచనా వేస్తున్నారు. పవన్ కల్యాణ్ కూడా ఎట్టి పరిస్థితుల్లోను ఇక్కడి నుంచి నెగ్గి అసెంబ్లీలోకి అడుగుపెట్టాలనే దృక్పథంతో ఉన్నారు. 11వ తేదీన పవన్ కు మద్దతుగా చిరంజీవి ప్రచారం చేసే అవకాశం ఉందంటున్నారు. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications