విశాఖపట్నంలో క్షణక్షణం.. భయం.. భయం..!?
విశాఖ ఎయిర్‌పోర్టు సమీపంలో మంత్రి రోజాపై కొందరు వ్యక్తులు దాడికి ప్రయత్నించారని ఆమె సహాయకుడు దిలీప్ కుమార్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. వైజాగ్ ఎయిర్ పోర్టు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. మెటల్ వస్తువుకు సంబంధించిన మూత తగిలి తన తలకు గాయమైందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. జనసేన పార్టీకి చెందిన 300 మంది కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని ఆరోపించారు.

28 మందిపై కేసులు
విమానాశ్రయంలో విధులు నిర్వహిస్తున్న పెందుర్తి సీఐ నాగేశ్వరరావు ప్రభుత్వ వాహనాలను, ఆస్తులను ధ్వంసం చేశారని ఫిర్యాదు చేశారు. దీనిపై వివిధ సెక్షన్ల కింద మరో కేసు నమోదు చేశారు. ఈ రెండు ఫిర్యాదులకు సంబంధించి 28 మంది జనసేన నాయకులు, కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయి. కేసు దర్యాప్తులో భాగంగా పార్టీ నాయకులు కోన తాతారావు, శివప్రసాద్‌రెడ్డిని అరెస్టు చేశారు. నోవాటెల్ హోటల్‌లో బస చేసిన సుందరపు విజయ్‌కుమార్, పీవీఎస్‌ఎన్ రాజులను అర్ధరాత్రి దాటిన తర్వాత అరెస్టు చేశారు. పోలీసులు పవన్ కల్యాణ్ బస చేసిన ఫ్లోర్‌లోనూ తనిఖీలు చేశారు.

కొనసాగుతున్న ఉద్రిక్తత
విశాఖపట్నంలో శనివారం సాయంత్రం నుంచి ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. విమానాశ్రయంలో మంత్రుల కాన్వాయ్‌పై దాడి జరగడం.. తర్వాత పవన్ ర్యాలీగా రావడం.. ప్రజల నుంచి భారీస్థాయిలో స్పందన రావడంతో పోలీసులు ర్యాలీని నియంత్రించలేకపోయారు. దీంతో పవన్ కల్యాణ్ ను ఎలాగైనా కట్టడి చేసేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. నగరంలో ర్యాలీ చేయకూడదని, ప్రజలకు అభివాదం చేస్తూ వెళ్లొద్దని 30 యాక్ట్-పోలీస్ కింద నోటీసులిచ్చారు.

ఆరో అంతస్తులో పవన్ బస
నోవాటెల్ హోటల్ ఆరో అంతస్తులో పవన్ కల్యాణ్ బస చేశారు. హోటల్ గది నుంచి విశాఖ సాగర అందాలు కనిపించడంతోపాటు హోటల్ గదిలో ఉన్న వారు కూడా బయట ప్రజలకు కనిపించడానికి అవకాశం ఉంది. దీంతో పవన్ ను చూసేందుకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు భారీసంఖ్యలో ఆ ప్రాంతానికి తరలివచ్చారు. తనకోసం అభిమానులు వేచి ఉన్న దృశ్యాలను జనసేనాని తన ట్విటర్‌లో పోస్టు చేశారు. మరోవైపు, జనసేన కార్యకర్తలు నోవాటెల్ హోటల్ వైపు రాకుండా పోలీసులు నియంత్రించే ప్రయత్నం చేస్తున్నారు. హోటల్ సమీపంలో ఉన్న వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. అలాగే వంద మీటర్ల పరిధిలో వ్యక్తుల సంచారం లేకుండా చర్యలు తీసుకున్నారు.












Click it and Unblock the Notifications