వైసీపీ ప్రభుత్వానికి హెచ్చరిక - ఇదే జరిగేది: పవన్ కల్యాణ్..!!
ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు.
ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఇలాంటి వ్యతిరేక ఫలితమే ఉంటుందని జోస్యం చెప్పారు. ఏపీలో జరిగిన మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. ఉపాధ్యాయ ఎన్నికల్లో వైసీపీ గెలుపొందగా.. పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఉత్తరాంధ్రతో సహా రెండు రాయలసీమ నియోజకవర్గాల్లోనూ టీడీపీ గెలిచింది. పీడీఎఫ్ తో చేసుకున్న అవగాహన కలిసి వచ్చింది. రెండో ప్రాధాన్యత ఓట్లతో మూడు నియోజకవర్గాల్లోనూ టీడీపీ అభ్యర్ధులు గెలుపొందారు. పట్టభద్రుల ఎన్నికల ఫలితాలపైన స్పందించిన పవన్.. ఉపాధ్యాయ నియోజకవర్గాల ఫలితాల పైన స్పందించలేదు.
ఏపీలో తాజాగా జరిగిన ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికలు..ఫలితాలు వైసీపీ ప్రభుత్వానికి హెచ్చరికలుగా పవన్ పేర్కొన్నారు. అధికారం తలకెక్కిన వైసీపీ నేతలకు పట్టభద్రులు తమ ఓటు ద్వారా కనువిప్పు కలిగించారని అని పవన్ కళ్యాణ్ అన్నారు. సందిగ్ధంలో ఉన్న వారికి ఈ ఎన్నిక ద్వారా పట్టభద్రులు దారి చూపారని.. రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తున్న తీరుకు పట్టభద్రులు తమ ఓటు ద్వారా నిరసన తెలిపారన్నారు. ఈ ఎన్నికల ఫలితాలు ప్రజల ఆలోచన ధోరణిని తెలియజేస్తున్నాయని పేర్కొన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఇలాంటి వ్యతిరేక ఫలితమే ఉంటుందని జోస్యం చెప్పారు. ప్రజాకంటక పాలనకు వ్యతిరేకంగా ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు చెబుతూ పవన్ ప్రకటన విడుదల చేసారు.

ఈ ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు. బీజేపీతో మిత్రపక్షంగా ఉన్నా..ఆ పార్టీ అభ్యర్ధికి అనుకూలంగా ప్రచారం చేయలేదు. వైసీపీకి వ్యతిరేకంగా ఈ ఎన్నికల్లో ఓట్లు వేయమని పిలుపునిచ్చిన జనసేన ఏ పార్టీకి వేయాలో మాత్రం స్పష్టత ఇవ్వలేదు. టీడీపీ ఈ ఎన్నికల్లో పీడీఎఫ్ తో అవగాహన కుదుర్చుకుంది. రెండో పాధాన్యత ఓటు తమకు బదిలీ అయ్యేలా చేసుకున్న ఒప్పందం కలిసి వచ్చింది. రెండో ప్రాధాన్యత ఓట్లు టీడీపీ గెలుపులో కీలకంగా మారాయి. ఈ ఎన్నికల్లో జనసేన నుంచి అధికారంతో సహకారం లేకపోయినా..టీడీపీ ఉత్తరాంధ్ర నేతలు మాత్రం తమ విజయంలో పవన్ కు భాగస్వామ్యం కల్పించారు. పవన్ పిలుపు మేరకు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా టీడీపీ అభ్యర్ధి విజయానికి దోహదపడిందని విశ్లేషించారు. ఇక..అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ -జనసేన పొత్తు ప్రకటన లాంఛనంగా భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications