టీడీపీ "మోత"కు జనసేన మద్దతు-జనసైనికులకు నాదెండ్ల పిలుపు..
ఏపీలో చంద్రబాబు అరెస్టు తర్వాత మారుతున్న రాజకీయ పరిస్దితుల్లో బహిరంగంగానే జట్టు కట్టిన టీడీపీ-జనసేన ఇప్పుడు ఉమ్మడిగా పోరాటాలకు కూడా పిలుపునిచ్చే పరిస్ధితి ఉంది. అంతకు ముందు పరస్పరం పొరుగు పార్టీల కార్యక్రమాలకు మద్దతు తెలుపుకుంటున్నారు. ఇదే క్రమంలో ఇవాళ సమావేశమైన టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ రేపటి పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు మద్దతు ప్రకటించగా.. దీనికి ప్రతిగా జనసేన కూడా టీడీపీ ఇవాళ సాయంత్రం తలపెట్టిన మోత మోగిద్దాం కార్యక్రమానికి మద్దతు పలికింది.
టీడీపీ ఇవాళ సాయంత్రం చంద్రబాబు అరెస్టుకు నిరసనగా మోత మోగిద్దాం పేరుతో ఓ కార్యక్రమం చేపట్టనుంది. ఇందులో భాగంగా పార్టీ నేతలు, కార్యకర్తలు ఎక్కడికక్కడ పళ్లాలపై కొట్టి మోత మోగించాలని నిర్ణయించారు. దీనికి జనసేన కూడా మద్దతు ప్రకటించింది. రేపు పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర నేపథ్యంలో వివరాలు వెల్లడించేందుకు ప్రెస్ మీట్ పెట్టిన పార్టీ నేత నాదెండ్ల మనోహర్.. టీడీపీ మోత మోగిద్దాం కార్యక్రమంలో పాల్గొనాలని జనసైనికులను కోరారు. దీంతో వారు కూడా మోత మోగించేందుకు సిద్దమవుతున్నారు.

వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయని పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించగా.. అందుకు అనుగుణంగా ఇరు పార్టీలు తమ క్యాడర్ ను సన్నద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నాయి. ఇరు పార్టీల నుంచి ప్రతినిధులను నామినేట్ చేసి ఓ జాయింట్ యాక్షన్ కమిటీని కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. ఇది ఆలస్యమవుతున్న నేపథ్యంలో ఆలోపు ఇరుపార్టీలు ఎవరు ఏ కార్యక్రమం ప్రకటించినా దానికి మద్దతు ఇచ్చుకుంటున్నాయి.
మరోవైపు టీడీపీతో పొత్తుపై జనసేనలో అక్కడక్కడా అసంతృప్త స్వరాలు వినిపిస్తున్న నేపథ్యంలో నాదెండ్ల మనోహర్ ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ జనసైనికులు ఎంతమేరకు టీడీపీ మోత మోగిద్దాం కార్యక్రమంలో పాలుపంచుకుంటాయో చూడాల్సి ఉంది. గతంలో బీజేపీతో పొత్తులో ఉన్నప్పటికీ ఎలాంటి ఉమ్మడి కార్యక్రమాలు చేపట్టని జనసైనికులు ఇప్పుడు టీడీపీతో కలిసి ఉమ్మడి కార్యక్రమాల్లో పాల్గొంటే ఆ ప్రభావం బీజేపీపై ఒత్తిడి పెంచడం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications