దీన్నయితే ఖండిస్తున్నా
Nagababu: పల్నాడు జిల్లా వినుకొండలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నాయకుడు షేక్ రషీద్ దారుణ హత్య.. కలకలం రేపుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతోంది. దీనిపై వైఎస్ఆర్సీపీ జాతీయ స్థాయి ఉద్యమానికి పూనుకుంటోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దృష్టికి తీసుకెళ్లనుంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చిన ఈ నెలన్నర రోజుల్లో రాష్ట్రంలో సంభవించిన వరుస హత్యలు, అత్యాచార ఘటనలను రాష్ట్రపతికి వివరించాలని నిర్ణయించింది.

వైఎస్ఆర్సీపీ నాయకుడు రషీద్‌ను వినుకొండలో తెలుగుదేశం పార్టీకి చెందిన జిలానీ నడిరోడ్డుపై నరికి చంపిన విషయం తెలిసిందే. చేతులు నరికాడు. మెడపై పలుమార్లు కత్తితో నరికాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ దాడిలో రషీద్ చేతులు తెగిపోయాయి. మెడపై తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ మరణించారు.
ఈ ఘటనపై తాజాగా జనసేన నాయకుడు నాగబాబు స్పందించారు. పాత కక్షల వల్లే వినుకొండలో హత్యోదంతం చోటు చేసుకుందని అన్నారు. పోలీసుల కూడా ఇది వ్యక్తిగత కక్షల వల్లే జరిగిందని తేల్చేశారని చెప్పారు. దీనికి రాజకీయ రంగును పులమడానికి ప్రయత్నించడం మంచిది కాదని హితవు పలికారు.
ఇన్ని రోజులు శవరాజకీయాలు చేసే వైఎస్ జగన్ ఇంతదూరం వచ్చారని ఆరోపించారు. ఆయన చెప్పే మాటలు ప్రజలు పట్టించుకునే రోజులు పోయాయని ఎద్దేవా చేశారు. ఈ హత్యను జనసేన నేతగా ఖండిస్తోన్నానని, దీని వెనుక ఎవరు ఉన్నా సరే అరెస్టు చేస్తామని, చట్టపరంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇంకా నెలన్నర రోజులు కూడా కాలేదని అప్పుడే వైఎస్ జగన్ గానీ, వైఎస్ఆర్సీపీ నాయకులు గానీ ఎన్నో విమర్శలు చేస్తోన్నారని, ఇది సరికాదని అన్నారు. అధికారంలో ఉన్నన్ని రోజులు నటించారని, ఇప్పుడు కూడా నటిస్తోన్నారని చురకలు అంటించారు.












Click it and Unblock the Notifications