బీఆర్ఎస్ లోకి జనసేన ముఖ్యనేత - కేసీఆర్ సైలెంట్ ఆపరేషన్..!?
ఏపీలో పొలిటికల్ జంపింగ్స్ ఊపందుకుంటున్నాయి. బీఆర్ఎస్ విస్తరణ ఏపీతో ప్రారంభించిన తెలంగాణ సీఎం కేసీఆర్ సైలెంట్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఏపీ అధ్యక్షుడిగా నియమితులైన తోట చంద్రశేఖర్ జనసేన నేతలతో టచ్ లో ఉన్నారు. జనసేనలో క్రియాశీలకంగా వ్యవహరించిన నేతలు ఇప్పుడు బీఆర్ఎస్ లో చేరేందుకు ముందుకు వస్తున్నారు. కాపు వర్గానికి చెందిన నేతలను బీఆర్ఎస్ లోకి తీసుకొచ్చేలా ప్రణాళికలు అమలు చేస్తున్నారు. అందులో భాగంగా పార్టీకి ..జనసేనాని పవన్ కు రాజకీయ సలహాదారుగా వ్యవహరించిన మాజీ ఐఏఎస్ రామ్మోహన్ రావు సీఎం కేసీఆర్ ను కలిసారు.

సీఎం కేసీఆర్ తో రామ్మోహన్ రావు భేటీ
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రామ్మోహన్ రావు గత ఎన్నికల ముందు జనసేనలో చేరారు. పార్టీ అధ్యక్షుడు పవన్ కు కళ్యాణ్ కు రాజకీయ సలహాదారుగా వ్యవహరించారు. అంతకు ముందు తమిళనాడు ప్రభుత్వంలో పలు కీలక హోదాల్లో పని చేసారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగానూ వ్యవహరించారు. జయలలిత అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్న సమయంలో రామ్మోహన్ రావు ప్రభుత్వ పాలనా వ్యవహారాల్లో కీలకంగా పని చేసారు. పదవీ విరమణ తరువాత ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రామ్మోహన్ రావు జనసేనలో చేరారు. కానీ, కొంత కాలంగా ఆయన పార్టీలో యాక్టివ్ గా లేరని తెలుస్తోంది.

చేరికలపై తోట ఫోకస్
కొద్ది రోజుల క్రితం రాయల్ ఆంధ్రప్రదేశ్ కాపు ఉద్యోగుల క్యాలెంటర్ విడుదల వేదికపైనా కీలక వ్యాఖ్యలు చేసారు. సినిమావాళ్లనో..ఓ పరిశ్రమనో నమ్ముకొని రాజకీయం చేయటం కాపులకు అసాధ్యమని చెప్పుకొచ్చారు. కులంలో నుంచి సమిష్టి నాయకత్వం వచ్చినప్పుడే ఈ సామాజిక వర్గం ముందుకెళ్తుందని వ్యాఖ్యానించారు. ఏపీలో ఏ పార్టీ కాపులకు బీసీ రిజర్వేషన్ ఇవ్వలేదని స్పష్టం చేసారు. అలా ఇస్తామని హామీ ఇచ్చినా అది ఒట్టి మాటేనని స్పష్టం చేసారు. బీసీలు, ఇతర కులాలను కలుపుకొని వెళ్తేనే రాజ్యాధికారం సాధ్యమవుతుందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు బీఆర్ఎస్ విస్తరణలో భాగంగా రామ్మోహన్ రావు సీఎం కేసీఆర్ ను కలిసిన సమయంలో..ఏపీలో పార్టీ విస్తరణ పైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

ఏపీకి కేసీఆర్.. కీలక నిర్ణయాలు
జనసేనకు దగ్గరగా పని చేసిన మరి కొంత మంది నేతలు బీఆర్ఎస్ లో చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. తోట చంద్రశేఖర్ తనకు ఉన్న పరిచయాలను బీఆర్ఎస్ లో చేరికల కోసం వినియోగిస్తున్నారు. ఈ నెలాఖరు లేదా ఫిబ్రవరి తొలి వారంలో సీఎం కేసీఆర్ ఏపీ పర్యటన ఉంటుందని సమాచారం. ఆ సమయంలో భారీ బహిరంగ సభతో పాటుగా ముఖ్య చేరికలు ఉండేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ఈ సభలో నే ఏపీకి సంబంధించిన అంశాలపైన పార్టీ అధినేతగా కేసీఆర్ క్లారిటీ ఇస్తారని చెబుతున్నారు. దీంతో, బీఆర్ఎస్ లో ఏపీ నుంచే చేరే నేతలు ఎవరు..ఆ నేతల ప్రభావం ఏ పార్టీ పైన ఉంటుంది..ఎవరి ఓటు చీలక తీసుకొస్తారనే లెక్కలు..విశ్లేషణలు మొదలయ్యాయి.












Click it and Unblock the Notifications