జనసేనాని నిర్ణయం జనసైనికులకు నచ్చటం లేదట ! పార్టీలో అంతర్గత చర్చ
Recommended Video
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు జనసేన సైనికులను తీవ్ర అసంతృప్తికి గురిచేస్తుంది. గత ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన జనసేన పార్టీ, ఇప్పుడిప్పుడే పుంజుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇక ఈ సమయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం జనసేన వర్గాల్లో చర్చకు కారణమవుతోంది.

జనసేన కమిటీలను ప్రకటించిన జనసేనాని .. పార్టీ శ్రేణుల్లో కమిటీలపై అసంతృప్తి
తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన పొలిట్ బ్యూరో సభ్యుల పేర్లను, పొలిటికల్ ఎఫైర్ కమిటీని , క్రమశిక్షణా సంఘం చైర్మన్ ను ప్రకటించారు. ఇక ఇందులో నాదెండ్ల మనోహర్, రాజు రవి తేజ్, పీ రామ్ మోహన్ రావు, అర్హం ఖాన్ లను పోలిట్ బ్యూరో సభ్యులు ప్రకటించారు. నాయకత్వ సామర్థ్యం... బాధ్యతాయుత దృక్పథం ఉన్నవారికే కమిటీల్లో స్థానం కల్పించినట్లు జనసేనాని పార్టీ నుండి లేఖను విడుదల చేసారు. అయితే ఈ నియామకాల్లో పవన్ కళ్యాణ్ ఎక్కువగా నాదెండ్ల మనోహర్ కు ప్రాధాన్యత ఇచ్చినట్లుగా కనిపిస్తోంది.

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణకు స్థానం లేదు .. నాదెండ్లకు మాత్రం పెద్ద పీట... జనసైనికుల్లో చర్చ
ఇటు పోలిట్ బ్యూరో లోనూ, అటు పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలోనూ నాదెండ్ల మనోహర్ కు స్థానం కల్పించారు పవన్ కళ్యాణ్. సమర్థుడైన నాయకుడు అయిన సీబీఐ మాజీ జేడీ వి.వి లక్ష్మీనారాయణ పేరు ఈ జాబితాలో ఎక్కడా కూడా లేకపోవడం చూసి జనసేన పార్టీ నేతలు కాస్త నిరాశ చెందారు. ఆయనకు కూడా పోలిట్ బ్యూరో కమిటీలో స్థానం కల్పిస్తే బాగుండేదని పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది.
అంతే కాకుండా ప్రతీ విషయంలో కూడా నాదెండ్ల మనోహర్ కే పెద్ద పీట వేస్తుండడం కూడా పార్టీ శ్రేణులకు అంతగా రుచించడం లేదు.మొత్తం నలుగురు ఉన్న పోలిట్ బ్యూరోలో జేడీ పేరు లేకపోవడం చూసి అసలు మాజీ జేడీ లక్ష్మీ నారాయణ జనసేనలో కొనసాగుతారా లేదా అన్న అనుమానం జనసేన సైనికులకు సైతం కలుగుతోంది.

మాజీ జేడీ లక్ష్మీనారాయణ పార్టీ మారతారని ప్రచారం .. జనసేన కమిటీలలో స్థానం లేకపోవటంపై అనుమానం
ఎన్నికల తరువాత ఓటమి పై మాట్లాడిన జనసేన నేత వి.వి లక్ష్మీనారాయణ, ఆ తర్వాత జనసేన కార్యక్రమాలలో పాల్గొన్న దాఖలాలు కనిపించలేదు. అయితే అపారమైన పరిజ్ఞానం ఉన్నటువంటి లక్ష్మీనారాయణకు పవన్ చోటు కల్పించపోవడం ఇప్పుడు జనసేన శ్రేణుల్లో అసంతృప్తిని కలిగిస్తుంది. ఇక మాజీ జెడి లక్ష్మీనారాయణకు జనసేన కమిటీల్లో స్థానం కల్పించకపోవడంపై అంతకు ముందు వరకు అదే పార్టీలో కొనసాగిన అద్దేపల్లి శ్రీధర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు . జేడీ, పార్ధ సారధి వంటి నాయకులను పవన్ పక్కన పెట్టడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదని ఆయన పేర్కొన్నారు . అయితే ఈ విషయంపై ఇప్పటివరకు మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
గత ఎన్నికల ముందే ఆయన సొంత పార్టీ పెట్టుకుని ఎన్నికలకు వెళ్లాలని భావించి కూడా, ఊహించని విధంగా జనసేనలో చేరి ఎన్నికల్ బరిలోకి దిగారు. ఓటమిపాలయ్యారు.అయితే ఇప్పుడు మాజీ జేడీ లక్ష్మీనారాయణ ప్రస్తుతం జనసేనలో వుండలేకపోతున్నారని, బీజేపీలోకి వెళ్లాలనే ఆలోచనలో వున్నారని ప్రచారం గత కొంతకాలంగా జరుగుతోంది. ఇక ఈ నేపధ్యంలో ఆయనకు జనసేన కమిటీలలో స్థానం కల్పించకపోవటం కూడా ఆ ప్రచారాలకు బలం చేకూరుస్తుంది.

పవన్ కళ్యాణ్ నిర్ణయం పట్ల జనసైనికుల కలవరపాటు .. ఇది జనసేనాని పొరబాటేనా ?
ఒక పక్క పార్టీని బలోపేతం చేయాలని భావిస్తూనే, పార్టీలో ఉన్న కీలక నేతలను విస్మరించి పవన్ కళ్యాణ్ కమిటీలు వేసిన తీరు జన సైనికులను కలవరపెడుతోంది. మంచి పేరున్న నాయకులకు స్థానం దక్కకపోవడంతో వారు పార్టీని వీడి బయటకు వెళ్తారేమో అన్న ఆందోళన కలుగుతోంది. నాదెండ్ల మనోహర్ పార్టీలో చేరినప్పటి నుంచి ఆయనకు పవన్ కళ్యాణ్ పెద్దపీట వేయడం పట్ల జనసేన పార్టీ నేతలు చాలా మంది తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇప్పుడు తాజాగా జనసేన పోలిట్ బ్యూరోలో స్థానం కల్పించడం తో పాటుగా, పొలిటికల్ అఫైర్స్ కమిటీ కి నాదెండ్ల మనోహర్ ను చైర్మన్ గా నియమించటం పై జనసేన శ్రేణులు గుర్రు గానే ఉన్నారని సమాచారం. ఇక ఇటువంటి సమయంలో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అన్న అన్న చర్చ జనసేన లో జోరుగా జరుగుతోంది.












Click it and Unblock the Notifications