వైవీ సుబ్బారెడ్డి స్థానంలో టీటీడీకి కొత్త ఛైర్మన్ - అనూహ్య ఎంపిక..!?
ప్రతిష్ఠాత్మక టీటీడీకి కొత్త ఛైర్మన్ రానున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ప్రస్తుత ఛైర్మన్ సుబ్బారెడ్డి తన పదవి నుంచి తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. ఏపీలో ముఖ్యమంత్రి జగన్ రానున్న ఎన్నికల కోసం ముందస్తుగానే కసరత్తు ప్రారంభించారు. అందులో భాగంగా కీకలమైన ఉత్తరాంధ్ర బాధ్యతలను వైవీ సుబ్బారెడ్డి పర్యవేక్షిస్తున్నారు. అదే సమయంలో ప్రతిష్ఠాత్మకమైన టీటీడీ బోర్డు ఛైర్మన్ గానూ కొనసాగుతున్నారు. వచ్చే ఆగస్టు వరకు సుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్ గా పదవీ కాలం ఉంది. ఆయనకు పార్టీ బాధ్యతల నేపథ్యంలో మార్పులకు రంగం సిద్దం అవుతున్నట్లుగా సమాచారం. సుబ్బారెడ్డి స్థానంలో టీటీడీ నూతన ఛైర్మన్ గా బీసీ వర్గానికి చెందిన పార్టీ సీనియర్ ను ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం.

టీటీడీ ఛైర్మన్ గా తప్పుకోనున్న సుబ్బారెడ్డి..?
తిరుమల తిరుపతి దేవస్థానం నూతన బోర్డు ఏర్పాటుకు కసరత్తు మొదలైంది. ప్రస్తుతం తిరుమలలో జనవరి 1, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. సంక్రాంతి వరకు తిరుమలలో రద్దీ కొనసాగనుంది. ఆ తరువాత కొత్త బోర్డు ఏర్పాటు పైన కసరత్తు వేగవంతం చేయనున్నారు. వైసీపీ ఏపీలో అధికారంలోకి వచ్చిన తరువాత వైవీ సుబ్బారెడ్డికి తొలుత టీటీడీ ఛైర్మన్ గా అవకాశం ఇచ్చారు. తొలి టర్మ్ పూర్తయిన తరువాత ఆయన్ను రాజ్యసభకు పంపుతారనే ప్రచారం సాగింది. కానీ, రెండో సారి కూడా ఆయనకే టీటీడీ ఛైర్మన్ గా అవకాశం దక్కింది. ఇదే సమయంలో కీలకమైన ఉత్తరాంధ్ర బాధ్యతలను సీఎం అప్పగించారు. విశాఖ కేంద్రంగా సాగుతున్న రాజకీయాల్లో పార్టీ నుంచి సుబ్బారెడ్డి కీలక పాత్ర పోషించాల్సి వస్తోంది. దీంతో, టీటీడీ ఛైర్మన్ బాధ్యతల నుంచి ఎన్నికల వరకు సుబ్బారెడ్డి తప్పుకొనేందుకు నిర్ణయించారని సమాచారం. ఇప్పటికే సీఎంకు ఈ విషయం పైన సమాచారం ఇవ్వగా..ముఖ్యమంత్రి అంగీకరించినట్లు తెలుస్తోంది.

సుబ్బారెడ్డి స్థానంలో జంగాకు ఛాన్స్..
మూడున్నారేళ్లుగా సుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్ గా ఉన్నారు. ఆయనకు వచ్చే ఆగస్టు వరకు కాల పరిమితి ఉంది. అయితే, ఎన్నికలకు సమాయత్తంలో భాగంగా సుబ్బారెడ్డి తప్పుకుంటే.. కొత్త ఛైర్మన్ ను నియమించాల్సి ఉంటుంది. ఈ సారి టీటీడీ ఛైర్మన్ గా బీసీ వర్గానికి చెందిన నేతకు ఇవ్వాలని ముఖ్యమంత్రి డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా వైసీపీ ఏర్పాటు నుంచి పార్టీలో క్రియాశీలకంగా ఉన్న బీసీ నేత జంగా కృష్ణమూర్తికి అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఆయన పార్టీకి విధేయుడిగా ఉండటంతో పాటుగా ఉమ్మడి గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతానికి చెందిన బీసీ (యాదవ వర్గం)కు చెందిన నేత. పార్టీలోని బీసీ నేతలతోనూ సత్సంబంధాలు ఉన్నాయి. గతంలో ఎమ్మెల్యేగా, టీటీడీ బోర్డు సభ్యుడిగా పని చేసారు. ఎమ్మెల్సీగా ఉన్నారు. బీసీలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో భాగంగా జంగా కృష్ణమూర్తి పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

ఎన్నికల బాధ్యతలతో మార్పు నిర్ణయం..
సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత టీటీడీ బాధ్యతలను బాబాయ్ సుబ్బారెడ్డికి అప్పగించారు. సున్నితమైన అంశాల్లో ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న సమయంలో టీటీడీ ఛైర్మన్ గా సుబ్బారెడ్డి సమర్ధవంతంగా వ్యవహరించారనే అభిప్రాయం ఉంది. మూడున్నారేళ్లుగా ఒకే వ్యక్తి ప్రతిష్ఠాత్మక టీటీడీ బోర్డు ఛైర్మన్ గా ఉండటంతో కొత్త విమర్శలకు అవకాశం ఇవ్వకూడదని భావిస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో ఉత్తరాంధ్రలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ సుబ్బారెడ్డి పాత్ర కీలకం కానుంది. ఇక, బీసీ నేతకు టీటీడీ ఛైర్మన్ ఇవ్వాలనేది కొంత కాలంగా సీఎం జగన్ అభిప్రాయం. గతంలో టీడీపీ హయాంలో పుట్టా సుధాకర్ యాదవ్ కు టీటీడీ ఛైర్మన్ గా అవకాశం కల్పించారు. ఇప్పుడు వైసీపీలోని బీసీ నేతల్లో కీలకంగా వ్యవహరిస్తున్న జంగా కృష్ణమూర్తి కి టీటీడీ ఛైర్మన్ గా అవకాశం దక్కటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. అదే విధంగా నూతన పాలక మండలి పైన నిర్ణయం తీసుకోనున్నారు.












Click it and Unblock the Notifications