చంద్రబాబుతో జవదేకర్ చర్చలు: పురంధేశ్వరికి ఎసరు?
హైదరాబాద్: బిజెపి, తెలుగుదేశం పార్టీల మధ్య చర్చలు శుక్రవారంనాడు కూడా కొలిక్కి రాలేదు. శుక్రవారం సాయంత్రం బిజెపి ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ ప్రకాష్ జవదేకర్ స్వయంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని కలిసి చర్చలు జరిపారు. ఇరు పార్టీల మధ్య పొత్తుకు సీట్ల సంఖ్య ఆటంకంగా మారింది. బిజెపి ఆడుగుతున్న సీట్లకు తెలుగుదేశం పార్టీ నిరాకరిస్తోంది.
తెలుగుదేశం పార్టీ తెలంగాణలో బిజెపికి సీట్లు కేటాయించే విషయంలో పట్టువిడుపులు ప్రదర్శిస్తున్నప్పటికీ సీమాంధ్రలో మాత్రం కచ్చితంగా వ్యవహరిస్తోంది. బిజెపి అడినన్ని సీట్లు ఇవ్వడానికి నిరాకరిస్తోంది. సీమాంధ్రలో బిజెపికి పది అసెంబ్లీ స్థానాలు, మూడు లోకసభ స్థానాలు ఇస్తామని తెలుగుదేశం పార్టీ చెబుతోంది. సీమాంధ్రలో తిరుపతి, రాజంపేట, నర్సాపురం లోకసభ స్థానాలు ఇస్తామని టిడిపి చెబుతోంది.

బిజెపి తమకు విజయవాడ, విశాఖపట్నం లోకసభ స్థానాలు కావాలని పట్టుబడుతోంది. దగ్గుబాటి పురంధేశ్వరిని పోటీకి దింపడానికి ఆ సీట్లను బిజెపి నాయకులు అడుగుతున్నట్లు తెలుస్తోంది. వాటిలో ఏదైనా ఒక్క సీటు నుంచి పురంధేశ్వరిని బరిలోకి దింపాలని బిజెపి యోచన. అయితే, ఆ సీట్లు ఇవ్వడానికి టిడిపి నిరాకరిస్తోంది. ఆ రకంగా పురంధేశ్వరికి తెలుగుదేశం పార్టీ ఎసరు పెడుతోందని అంటున్నారు.
అంతేకాకుండా, ప్రతి లోకసభ నియోజకవర్గం పరిధిలో ఒక్క అసెంబ్లీ సీటు ఇవ్వాలని బిజెపి అడుగుతోంది. అయితే, దానికి కూడా టిడిపి సిద్ధంగా లేదు. పది అసెంబ్లీ సీట్లు మాత్రమే ఇస్తామని టిడిపి చెబుతోంది. సీమాంధ్రలో 3 లేదా 4 లోకసభ స్థానాలు మాత్రమే బిజెపికి కేటాయించాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. చివరికి 13 లేదా 14 అసెంబ్లీ సీట్లు కేటాయించడానికి టిడిపి ముందుకు రావచ్చునని భావిస్తున్నారు.
తెలంగాణలో మాత్రం బిజెపి 25 శాసనసభా స్థానాలు, 8 లోకసభ స్థానాలు బిజెపికి కేటాయించడానికి తెలుగుదేశం సుముఖత వ్యక్తం చేస్తోంది. అయితే తమకు 60 శాసనసభా స్థానాలు కావాలని బిజెపి అడుగుతోంది. కనీసం 40, 45 ఇచ్చినా ఫరవాలేదనే పద్ధతిలో బిజెపి వ్యవహరిస్తోంది. కానీ టిడిపి అందుకు అంగీకరించడం లేదు.
బిజెపి నాయకులతో ఇప్పటి వరకు తెలుగుదేశం పార్లమెంటు సభ్యులు సుజనా చౌదరి, సిఎం రమేష్ చర్చలు జరుపుతూ వచ్చారు. ప్రకాష్ జవదేకర్, అరుణ్ జైట్లీ చంద్రబాబుతో ఇంత కాలం ఫోన్‌లోనే మాట్లాడుతూ వచ్చారు. శుక్రవారంనాడు నేరుగా ప్రకాష్ జవదేకర్ చంద్రబాబు నివాసానికి వెళ్లి చర్చలు జరిపారు. చర్చలు ఉగాది నాటికి కొలిక్కి రావచ్చునని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications