JP, JD... గెలుస్తారా ? చీలుస్తారా?
జేపీ, జేడీ.. ప్రస్తుతం ఈ రెండు పేర్లు రాష్ట్ర రాజకీయాల్లో నానుతున్న పేర్లు. లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ, సీబీఐ మాజీ జేడీ వి.వి.లక్ష్మీనారాయణ. తటస్తులగా ప్రజలంతా వీరిపై అభిమానం చూపిస్తారు. కానీ రాజకీయాల్లోకి వచ్చేసరికి ఆ అభిమానం ఉండదు. ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి వెళ్లే ప్రతి వ్యక్తి ఆ సమయంలో తాను వేసే ఓటు మురిగిపోకూడదని, గెలిచే అభ్యర్థికే తన ఓటు వేయాలనే ఆలోచనతో ప్రధాన పార్టీ అభ్యర్థికి ఓటు వేస్తాడు. ఓటు వేయడం కోసం పోలింగ్ కేంద్రం వద్ద క్యూలో నిలబడిన ప్రతి ఓటరు మనస్తత్వం ఇలాగే ఉంటుంది.

ప్రధాన గుర్తుపైనే ఓటరు దృష్టి
తాను ఓటు వేసిన పార్టీకానీ, అభ్యర్థికానీ గెలవాలని కోరుకుంటాడు. ఆ సమయంలో ఎంత మంది నిజాయితీ పరులు, ఎంతమంది కర్తవ్య దీక్షా పరులు బరిలో ఉన్నప్పటికీ 'గుర్తు'పైనే దృష్టి పెడతాడు. ఏపీలో ప్రధాన పార్టీలుగా వైఎస్సార్ కాంగ్రెస్ ఫ్యాన్ గుర్తును తెలుగుదేశం సైకిల్ గుర్తును, జనసేన గాజుగ్లాసు గుర్తును, బీజేపీ కమలం, కాంగ్రెస్ హస్తంతోపాటు కమ్యూనిస్టు పార్టీలు, వివిధ నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులుంటారు. ఫ్యాన్ గుర్తుకు, సైకిల్ గుర్తుకు ప్రస్తుతం హోరాహోరీ పోరు నడుస్తోంది. ఓటు వేయడానికి వెళ్లిన వ్యక్తి ఈ రెండింటిలో ఒకదానికి వేస్తున్నాడు. రాబోయే ఎన్నికల్లో జరిగేది కూడా అదే.

విశాఖపట్నంలో 'జేడీ' ఓటమి
'జేడీ' లక్ష్మీనారాయణ జనసేన తరఫున విశాఖపట్నం నుంచి ఎంపీ అభ్యర్థిగా నిలబడినప్పటికీ అక్కడి పట్ణణ ప్రాంత ఓటర్లు నిర్ణయం తీసుకోలేకపోయారు. అయితే ఆయన భారీగా చీల్చిన ఓట్లు వైసీపీ అభ్యర్థి గెలవడానికి దోహదపడింది. పట్టణ ఓటర్లు ఎక్కువగా ఉన్న విశాఖలో నాలుగు అసెంబ్లీ స్థానాలు టీడీపీ పరమయ్యాయి. ఎంపీ అభ్యర్థి 5వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. జేడీకి 2 లక్షల 88వే ఓట్లు వచ్చాయి. వైసీపీకి 4 లక్షల 36వేలు, టీడీపీకి 4 లక్షల 32వేలు వచ్చాయి. నోటాకు 16వేలకు పైగా ఓట్లు పడటం గమనార్హం.

మల్కాజిగిరిలో 'జేపీ' ఓటమి
2009లో 'జేపీ' మల్కాజిగిరి నుంచి ఎంపీగా పోటీచేసి 1లక్షా, 58వేల ఓట్లు సాధించారు. ఆ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీచేసిన మల్లారెడ్డి కి 5 లక్షల 23వేల ఓట్లు రాగా, టీఆర్ఎస్ అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావుకు 4 లక్షల 94వేల ఓట్లు వచ్చాయి. మల్లారెడ్డికి 26వేలకు పైగా మెజారిటీ వచ్చింది. ఎన్నికల వ్యవస్థలో ప్రజలు ఒక ప్రధాన గుర్తుకు అలవాటు పడివుంటారు. ఎమ్మెల్యే నియోజకవర్గానికి వచ్చే సరికి ఆ ఇబ్బంది ఉండదు. మల్కాజిగిరి నుంచి ఎంపీగా ఓటమిపాలైన జేపీ కూకట్ పల్లి నుంచి గెలుపొందడానికి కారణం కూడా అదే. టీడీపీ తరఫున పోటీకి నిలబెట్టకపోవడంవల్లే ఆయన విజయం సాధించారు. ఈ రెండు ఉదాహరణలవల్ల ప్రధానంగా తేలుతున్నదేమిటంటే విధి నిర్వహణలో నిక్కచ్చిగా ఉంటూ, నిజాయితీగా పనిచేసిన ఎంతటివారైనా వారికంటూ ఒక స్వతంత్రత ఉండటం కోసం పోటీచేసినవారెవరూ ఆదరణ పొందలేకపోయారు. రానున్న ఎన్నికల్లో జేపీ మరోసారి విజయవాడ నుంచి, జేడీ విశాఖ నుంచి అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నలట్లు వార్తలు వస్తున్నాయి. విజయం సాధిస్తారా? ఓట్లు చీల్చి వేరే పార్టీ గెలవడానికి కారకులవుతారా? అనేది తేలాలంటే ఎన్నికలు జరిగి, ఫలితాలు వచ్చేంతవరకు ఎదురుచూడక తప్పదు.












Click it and Unblock the Notifications