రాజకీయాలు, సినిమాలు వద్దు తిరుమలలో జయసుధ
చిత్తూరు: తాను కుటుంబ సమేతంగా శ్రీవారి ఆశీస్సులు పొందినందుకు ఆనందంగా ఉందని, పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో తాను రాజకీయాలు, సినిమాల గురించి మాట్లాడనని సికింద్రాబాద్ శాసన సభ్యురాలు జయసుధ అన్నారు. ఆమె శనివారం కుటుంబ సభ్యులతో శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా ఆమె ఆలయం వెలుపల ఆమె మాట్లాడారు. కుటుంబ సమేతంగా స్వామివారి ఆశీస్సులు పొందినందుకు ఆనందంగా ఉందన్నారు. తన కుమారులు సినీ రంగంలో ఆడుగు పెట్టడం వారి ఇష్టమేనని వ్యాఖ్యానించారు. జయసుధ తన భర్త నితిన్ కపూర్, కుమారులు నిహార్, శ్రియాంక్‌లతో కలిసి శుక్రవారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. శనివారం ఉదయం ప్రారంభ సమయంలో స్వామివారే సేవలో పాల్గొన్నారు.

కాగా, పలువురు ప్రముఖులు శనివారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్న విషయం తెలిసిందే. విఐపి ప్రారంభ దర్శన సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కెసి భానుకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం తర్వాత స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ప్రముఖ సినీ నటుడు నాగార్జున, అఖిల్ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. త్వరలోనే తాను ప్రేక్షకుల ముందుకు వస్తానని నాగార్జున మీడియాతో చెప్పారు. ఉగాదికల్లా ప్రేక్షకుల ముందుకు రావడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలిపారు. కాంగ్రెసు బహిష్కృత పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు కూడా శ్రీవారిని దర్శించుకున్నారు.
కొత్త పార్టీ ఏర్పాటుపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని అడగాలని రాయపాటి సాంబశివ రావు అన్నారు. తాను ఏ పార్టీలో చేరేది త్వరలనే చెబుతానని ఆయన అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి సీమాంధ్రలో కొత్త పార్టీ పెడుతారనే అభిప్రాయం బలంగానే ఉంది. అందుకు రాయపాటి సాంబశివ రావు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications