అనంతలో జేసీ దివాకర్ రెడ్డి కొత్త రాజకీయం - సీఎం జగన్ పర్యటన వేళ..!!
అనంతలో కొత్త రాజకీయ సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. ఇప్పటి వరకు రాజకీయంగా కొంత స్తబ్దుగా కనిపించిన జేసీ దివాకర్ రెడ్డి కొత్త రాజకీయం మొదలు పెట్టారు. తిరిగి రాజకీయంగా యాక్టివ్ అవుతూనే తెలంగాణలో సీమను కలపాలనే డిమాండ్ మరోసారి తెర మీదకు తెచ్చారు. దీనిని కొందరు సీమ నేతలు తప్పు బట్టారు. తెలంగాణ మంత్రులు ఇది ఇప్పుడు సాధ్యం కాదని తేల్చి చెబుతున్నారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ శింగనమలలో పర్యటిస్తున్నారు. ఈ సమయంలో పీసీసీ మాజీ చీఫ్ శైలజానాధ్ ఇంటికి జేసీ వెళ్లటం రాజకీయంగా కీలకంగా మారింది.
జేసీ దివాకర్ రెడ్డి సుదీర్ఘకాలం కాంగ్రెస్ లో కొనసాగారు. అనేక పదవులు నిర్వహించారు. 2014 ఎన్నికల సమయంలో టీడీపీలో చేరి ఎంపీ అయ్యారు. 2019 ఎన్నికల తరువాత కొంత కాలంగా యాక్టివ్ గా ఉన్నా.. కొద్ది రోజుల క్రితం వరకు జేసీ ప్రభాకర రెడ్డి కేంద్రంగానే తాడిపత్రి రాజకీయం సాగింది. ఇప్పుడు రీ ఎంట్రీ ఇచ్చిన జేసీ దివాకర్ రెడ్డి రాష్ట్ర విభజన సమయంలో ప్రతిపాదించిన సీమను తెలంగాణలో కలపాలనే వాదన తిరిగి తెర మీదకు తీసుకొచ్చారు. దీనికి బైర్రెడ్డి రాజశేఖర రెడ్డి లాంటి వారు వెంటనే స్పందించారు. ఈ ప్రతిపాదనను ఖండించారు. తెలంగాణ మంత్రి జగదీశ్వర్ రెడ్డి తాజాగా జేసీ చేసిన ప్రతిపాదన ఆచరణ సాధ్యం కాదని తేల్చి చెప్పారు. జేసీ మాత్రం తాను అందరి నేతలతోనూ కలుస్తానని ప్రకటించారు.

ఇప్పుడు ఆకస్మికంగా జేసీ దివాకర్ రెడ్డి మాజీ పీసీసీ చీఫ్ శైలజానాధ్ నివాసానికి వెళ్లారు. కాంగ్రెస్ లో ఉన్న సమయంలో జేసీ దివాకర్ రెడ్డితో శైలజానాధ్ దూరంగా ఉండేవారు. రఘువీరాతో సన్నిహితంగా మెలిగే వారు. రాష్ట్ర విభజన తరువాత శైలజానాద్ ఏపీ పీసీసీ చీఫ్ గా వ్యవహరించారు. ఆయన స్థానంలో గిడుగు రుద్రరాజును కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించిన తరువాత శైలజానాధ్ పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం. అందులో భాగంగా టీడీపీ వైపు శైలజానాధ్ చూస్తున్నారని ప్రచారం సాగింది. శైలజానాధ్ సొంత నియోజకవర్గం శింగనమలలో టీడీపీలో నేతల మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. ఈ సమయంలో శైలజానాధ్ కు పార్టీలో చేరినా ఎంత వరకు నేతల నుంచి మద్దతు ఉంటుందనే మీమాసంలో పడినట్లుగా సమాచారం.
ఇప్పుడు సడన్ గా శైలజానాధ్ ఇంటికి వెళ్లి జేసీ దివాకర్ రెడ్డి జిల్లాలో రాజకీయ అంశాలపైన చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో వైసీపీ నుంచి శైలజానాధ్ కు ఆఫర్ రావటంతో, టీడీపీలోకి రావాలని జేసీ సూచిస్తున్నట్లుగా తెలుస్తోంది. జేసీ దివాకర్ రెడ్డి జిల్లా వ్యాప్తంగా టీడీపీలో తన పట్టు పెంచుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా కాంగ్రెస్ లో పని చేసిన కొందరు నేతలను ఇప్పుడు టీడీపీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం. తాజాగా రఘువీరా తిరిగి కాంగ్రెస్ లో చేరారు. దీంతో, జిల్లాలో జేసీ దివాకర్ రెడ్డి పెద్దరికం..కొత్త రాజకీయం ఎంత వరకు ఫలిస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications