మోడీపై జేసి తీవ్రవ్యాఖ్యలు, చంద్రబాబు ఢిల్లీకి వెళ్తే ఏపీ సమస్యలు చిటికెన వేలుపై తీరుస్తారు
అనంతపురం/కర్నూలు: ప్రధాని నరేంద్ర మోడీపై తెలుగుదేశం పార్టీ అనంతపురం పార్లమెంటు సభ్యులు జేసీ దివాకర్ రెడ్డి ఆదివారం తీవ్రంగా మండిపడ్డారు. మోడీ నియంతలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను చూసేందుకు వెళ్లిన నలుగురు ముఖ్యమంత్రుల్ని అడ్డుకుని అవమానించారన్నారు.
ఢిల్లీ సీఎంను కలవకుండా లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ముఖ్యమంత్రులకు అవకాశం ఇవ్వకపోవడం సరికాదన్నారు. సమస్యను పరిష్కరించడాన్ని పక్కనపెట్టి మోడీ రాజకీయాలు చేస్తున్నారన్నారన్నారు. తాను నియంత హిట్లర్‌ను చూడలేదని, కానీ మోడీని చూస్తుంటే ఇలాగే ఉంటాడని అర్థమవుతోందన్నారు.

హిట్లర్‌ను మించిన నియంత
ప్రధాని నరేంద్ర మోడీని చూస్తే నియంతలా కనిపిస్తున్నారని జేసీ దివాకర్ రెడ్డి నిప్పులు చెరిగారు. హిట్లర్ ఇలాగే ఉండేవాడా అనిపిస్తోందన్నారు. నలుగురు సీఎంలు కలిసి ఓ ముఖ్యమంత్రిని (కేజ్రీవాల్) కలిసేందుకు వెళ్తే అనుమతించకుంటే ఎలాగని ప్రశ్నించారు. హిట్లర్ కూడా ఇలా ప్రవర్తించి ఉండరన్నారు.

ఏపీలోను వారసులు
దేశంలో ప్రాంతీయ పార్టీలు బలపడుతున్నాయని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. జమ్ము కాశ్మీర్, కర్ణాటక, ఒడిశా.. ఇలా అంతా ప్రాంతీయ పార్టీలే అన్నారు. ఆయా చోట్ల ప్రాంతీయ పార్టీలలో నెక్స్ట్ జనరేషన్ వచ్చిందన్నారు. ఇక్కడ ఏపీలోను వారసులు వస్తారని పరోక్షంగా నారా లోకేష్‌ను ఉద్దేశించి అన్నారు.

చంద్రబాబుకు చెప్పా.. ఢిల్లీకి వెళ్తే ఏపీ సమస్యలు చిటికెన వేలుపై తీరుస్తారు
చంద్రబాబు నాయుడు నాడు ప్రధాని పదవి వచ్చినా వదులుకున్నారని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. రాష్ట్రం కోసం దానిని వదిలేశారన్నారు. ఇదే విషయాన్ని తాను మహానాడులో స్పష్టంగా చెప్పానన్నారు. ఇక్కడ ఎన్నాళ్లు ఉంటావని, రాష్ట్రానికి సేవలు చేశారని, అలాగే దేశానికి విస్తృత సేవలు అందించాలని చెప్పానన్నారు. దేశంలో కీలక పదవిలో ఉంటే రాష్ట్ర ప్రయోజనాలను చిటికెన వేలుపై తీర్చేస్తారన్నారు. కాబట్టి ఆయన ఢిల్లీకి వెళ్లాలన్నారు. చంద్రబాబు ప్రధాని అవుతాడా కాడా అంటే తాను చెప్పలేనని, కానీ వంద శాతం కీలక పాత్ర పోషిస్తారని, కింగ్ పింగ్ అవుతాడన్నారు.
Recommended Video


దువ్వడం ఎందుకు, ఇచ్చినవి అమలు చేస్తే చాలు
రాజ్యసభ టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ కేసీఆర్, ఒడిశాలో పట్నాయక్ తదితరులను దవ్వుతున్నారన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ అనవసరంగా అందరి గెడ్డాలు పట్టుకునే బదులు, కమిట్‌మెంట్ ఇచ్చినవి చేస్తే అంటే ఇచ్చిన హామీలు నెరవేరిస్తే సరిపోతుందన్నారు.












Click it and Unblock the Notifications