స్పందన శుద్ధ దండగ; అవసరమైతే అధికారుల కాళ్ళు పట్టుకుంటా: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలనం!!
తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి ఏపీ ప్రభుత్వం పై, ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమం పై తనదైన శైలిలో మండిపడ్డారు. ఇప్పటికే మున్సిపల్ కమీషనర్ అవినీతిపై తనదైన శైలిలో నిరసన తెలిపి, మున్సిపల్ కార్యాలయం వద్దే రచ్చ చేసిన ఆయన తాజాగా స్పందన కార్యక్రమం ప్రజల సమయం వృధా చెయ్యడానికే తప్ప ఎందుకూ పనికిరాదని పేర్కొన్నారు.
మున్సిపల్ చైర్మన్ గా రెండు సంవత్సరాలలో తాను స్పందన లో అనేక అర్జీలను ఇచ్చానని, అందులో ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదని జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. స్పందన కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న అధికారులకు అనేక మార్లు అర్జీలు ఇచ్చానని పేర్కొన్న ఆయన, సమస్యలు పరిష్కరించలేని స్పందన కార్యక్రమం దేనికోసం అంటూ నిలదీశారు.

ఎమ్మెల్యే స్వయంగా ఫిర్యాదు చేసినా కూడా సమస్య పరిష్కారం కాకపోతే స్పందన కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహిస్తున్నారో చెప్పాలన్నారు. ప్రజలు అక్కడకు వచ్చి, అప్లికేషన్లు రాసి అధికారులకు ఇస్తే వారేమి చేస్తున్నారో చెప్పాలన్నారు. స్పందన దండగ అన్న జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ గా తాను 2 ఏళ్ల కాలంలో 16కేజీల అర్జీలను స్పందన కార్యక్రమంలో అధికారులకు ఇచ్చానని, అందులో ఒక సమస్య కూడా పరిష్కారం కాలేదని ఎద్దేవా చేశారు.
తాను అధికారులకు పెట్టిన విజ్ఞప్తుల అర్జీలను తూకంలో అమ్మితే 750 రూపాయలు వచ్చాయని, స్పందన కార్యక్రమం శుద్ధ దండగ అంటూ విమర్శలు గుప్పించారు. ఆయన స్పందనలో పెట్టిన ఆర్జీల కట్టలను మీడియా ముందు ప్రదర్శించి మరీ అసహనం వ్యక్తం చేశారు. తాడిపత్రిలో సమస్యలు పరిష్కరించాలని మరోమారు విజ్ఞప్తి చేస్తున్నాం అని చెప్పిన జేసీ ప్రభాకర్ రెడ్డి, అవసరమైతే అధికారుల కాళ్ళు పట్టుకుంటానంటూ వ్యాఖ్యలు చేశారు. తాను లేవనెత్తిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
దేశంలో ఆడిట్ జరిగే మున్సిపాలిటీ తాడిపత్రి మాత్రమేనని, అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. అధికారులను తీసేసి పాలెగాళ్ళను పెట్టండి అంటూ అసహనం వ్యక్తం చేశారు. నాలుగు రోజులపాటు మున్సిపల్ కార్యాలయంలో నిరసన దీక్ష చేసినా సమస్యలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరు మార్చుకోవాలని హితవు పలికిన జేసీ ప్రభాకర్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేపై చెప్పులు వేసినట్టే రేపు అధికారులపై కూడా చెప్పులు వేసే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications