తాడిపత్రి మున్సిపాలిటీ ముందే స్నానం చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి.. వినూత్న నిరసన!!
తాడిపత్రిలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. తాడిపత్రి మున్సిపల్ కమిషనర్ వర్సెస్ తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ అన్నట్టుగా సాగుతున్న రాజకీయాలు అనేక ఉద్రిక్తతలకు కారణంగా మారాయి. అనంతపురం జిల్లా తాడిపత్రి తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ తీరును నిరసిస్తూ నేడు వినూత్న నిరసన తెలియజేశారు.
మున్సిపల్ కార్యాలయం ఆవరణలోనే స్నానం చేసి ఆదర్శవంతమైన మునిసిపాలిటీని అధ్వానంగా తయారు చేశారని ఆయన తన నిరసనను వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా వ్యవహారశైలిని వ్యతిరేకిస్తూ, ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆందోళనకు పిలుపునిచ్చారు.

తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు ఈ నిరసన దీక్షను శాంతియుతంగా నిర్వహించాలని భావించినప్పటికీ శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని టిడిపి నాయకులను పోలీసులు ఇళ్ల నుంచి బయటకు రాకుండా చేసి గృహనిర్బంధం చేశారు. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి ఎలాగైనా మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి తీరతానని రాత్రి ఇంటి నుంచి మున్సిపల్ కార్యాలయానికి వెళుతున్న క్రమంలో మార్గం మధ్యలో పోలీసులు అడ్డగించారు.
దీంతో డివైడర్ల పైన బైటాయించిన జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు టిడిపి నాయకులు, డివైడర్ల పైన పడుకుని నిరసన తెలియజేశారు. ఆ తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి అర్ధరాత్రి దాటిన తర్వాత మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. ఇక తెల్లవారే వరకు అక్కడే పడుకుని, ఉదయం అక్కడే బ్రష్ చేసుకుని, ఆరు బయట స్నానం చేసి వినూత్నంగా నిరసన తెలియజేశారు.

ఇక ఈ సందర్భంగా మాట్లాడిన జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదర్శవంతమైన మున్సిపాలిటీని అధ్వానంగా తయారు చేశారు అంటూ మండిపడ్డారు. మున్సిపల్ కమిషనర్ బాధ్యత లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరిగారు. మున్సిపల్ కార్యాలయంలో ఎన్నో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని మున్సిపాలిటీకి సంబంధించిన డీజిల్, ఇనుము వంటివి మాయం అవుతున్నాయని పేర్కొన్నారు.
ఇందులో మున్సిపల్ కమిషనర్ ప్రమేయం కూడా ఉందని ఆయన ఆరోపించారు. మున్సిపల్ కమిషనర్ వచ్చేవరకు తాను ఆందోళన విరమించేది లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. మొత్తానికి మున్సిపల్ ఆఫీసుకు వస్తానని, ఆందోళన చేస్తానని పేర్కొన్న జేసీ ప్రభాకర్ రెడ్డి తన పంతాన్ని నెగ్గించుకున్నారు. మున్సిపల్ కార్యాలయం ముందు వినూత్నంగా నిరసన తెలియజేశారు.












Click it and Unblock the Notifications