జగన్ హింసించాడు, పోలీసులు వంచించారు, జేసీ బ్రదర్స్ రూటే సపరేటు, మైండ్ బ్లాక్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల్సిన అవసరంలేదు, ఇక జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు, మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ. ప్రభాకర్ రెడ్డి బుధవారం వైసీపీ నాయకులకు సినిమా చూపించడానికి సిద్దం అయ్యారు. కొడుకు ఎమ్మెల్యే అయిన తరువాత జేసీ. ప్రభాకర్ రెడ్డి దూకుడు పెంచారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ అండదండలతో తనను, టీడీపీ కార్యకర్తలను హింసించి తమ మీద తప్పుడు కేసులు పెట్టారని ఇంతకాలం జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అప్పటి తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఒత్తిడితో మా మీద పెట్టిన తప్పుడు కేసులు ఎత్తివేయకపోతే మా సత్తా చూపిస్తామని గత కొన్ని రోజుల నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసు అధికారులకు చెబుతూనే ఉన్నారు.

అయితే పోలీసు అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఎన్నికల పోలింగ్ రోజున తాడిపత్రిలో రాళ్లదాడులు జరిగాయి, ఆ సమయంలో పోలీసులు వైసీపీ నాయకులకు అనుకూలంగా వ్యవహరించారని, తమ మీద తప్పుడు కేసులు పెట్టారని, టీడీపీ కార్యకర్తలను జైలుకు పంపించారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. ఆ రోజు అధికారంలో ఉన్న వైసీపీ నాయకులు చెప్పినట్లు పోలీసులు ఆడారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు.
తమ మీద నమోదు చేసిన తప్పుడు కేసులకు సాక్షాలు చూపించాలని ఆ రోజు నుంచి పోలీసు అధికారులను జేసీ ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేస్తూనే ఉన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 50 రోజులు దాటిపోవడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి నేరుగా రంగంలోకి దిగారు. బుదవారం జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన అనుచరులు సుమారు 150 వాహనాల్లో తాడిపత్రి నుంచి అనంతపురం ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ కు బయలుదేరి వెళ్లారు.

అనంతపురం పోలీస్ స్టేషన్ ముందు నిరసన వ్యక్తం చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి పోలింగ్ రోజు తాడిపత్రిలో జరిగిన రాళ్ల దాడికి తనతో పాటు టీడీపీకి కార్యకర్తలకు ఏం సంబంధం ఉంది చెప్పండి, మా మీద ఎందుకు తప్పుడు కేసులు పెట్టారు, మేమే రాళ్లదాడి చేశామని చెప్పడానికి మీ దగ్గర ఎలాంటి సాక్షాలు ఉన్నాయి అని నిలదీశారు. ఆ సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డికి నచ్చచెప్పడానికి పోలీసులు నానా తంటాలుపడ్డారు.

తరువాత మామీద వైసీపీ ప్రభుత్వంలో పెట్టిన తప్పుడు కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ జేసీ ప్రభాకర్ రెడ్డి అనంతపురం జిల్లా ఎస్పీని కలవడానికి ఆయన కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ మమ్మల్ని హింసించాడని, వైసీపీ నాయకుల మాటలు విని మా కుటుంబాన్ని, టీడీపీ నాయకులను పోలీసులు చిత్రహింసలకు గురి చేశారని, మేము ఎవ్వరిని వదిలిపెట్టమని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications