ఏపీ గవర్నర్ ఢిల్లీలో పర్యటిస్తోన్న వేళ- జేడీ లక్ష్మీనారాయణ సంచలనం: జగన్‌పై ఒత్తిడి
ఏపీ గవర్నర్ గా కొత్తగా బాధ్యతలను స్వీకరించిన సయ్యద్ అబ్దుల్ నజీర్.. ఢిల్లీలో పర్యటిస్తోన్నారు. ఈ పరిస్థితుల్లో జేడీ లక్ష్మీనారాయణ ఆయనకు కీలకమైన విజ్ఞప్తి చేశారు.
అమరావతి: ఏపీ గవర్నర్ గా కొత్తగా బాధ్యతలను స్వీకరించిన సయ్యద్ అబ్దుల్ నజీర్.. ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. రెండురోజుల పర్యటన కోసం ఆయన ఇవ్వాళ ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. తన పర్యటన సందర్భంగా కొందరు కేంద్రమంత్రులను కలిశారు. అనంతరం రాష్ట్రపతి భవన్ కు బయలుదేరి వెళ్లారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశం అయ్యారు. ఆదివారం మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ కాబోతోన్నారు.

రేపు మోదీతో భేటీ..
గవర్నర్ గా బాధ్యతలను స్వీకరించిన మరుసటి రోజే ఆయన హస్తిన పర్యటనకు బయలుదేరి వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ మధ్యాహ్నం గవర్నర్ ఢిల్లీకి చేరుకున్నారు. ఈ మధ్యాహ్నం 3:30 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. ఆదివారం మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుసుకోనున్నారు. ఆ తరువాత కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతోనూ ఆయన సమావేశం కానున్నారు.

జేడీ లక్ష్మీనారాయణ కీలక విజ్ఞప్తి..
గవర్నర్ గా ప్రమాణస్వీకారం చేసిన మరుసటి రోజే ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్లడం చర్చనీయాంశమైంది. మర్యాదపూరకంగా ఆయన కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలుసుకోనున్నారు. ఈ పరిణామాల మధ్య సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ కీలక అంశాన్ని లేవనెత్తారు. గవర్నర్ కు ఓ వినతిని పంపించారు. ఈ మేరకు ఈ సమాచారాన్ని తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసిన ఆయన దీన్ని గవర్నర్, వైఎస్ జగన్, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ కు ట్యాగ్ చేశారు.

ఆర్థికస్థితిపై శ్వేతపత్రం..
రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలనేది లక్ష్మీనారాయణ డిమాండ్. రాష్ట్ర ప్రభుత్వం ఎలాగూ దీనికి అంగీకరించదని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే నేరుగా ఈ డిమాండ్ ను గవర్నర్ అబ్దుల్ నజీర్ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేసేలా జగన్ ప్రభుత్వాన్ని ఆదేశించాలని గవర్నర్ కు లక్ష్మీనారాయణ విజ్ఞప్తి చేశారు.

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ముందే..
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందే ఈ శ్వేతపత్రాన్ని విడుదల చేయాల్సి ఉంటుందని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై పరస్పర విరుద్ధమైన నివేదికలు వెలువడుతోన్నాయని ఆయన అన్నారు. ఈ విరుద్ధమైన నివేదికల వల్ల గందరగోళం నెలకొందని పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని- బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందే రాష్ట్ర ఆర్థిక స్థితిపై శ్వేతపత్రం విడుదల చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు.

14 నుంచి అసెంబ్లీ..
మార్చి 14వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతాయి. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో సంక్షేమ పథకాలకు వైసీపీ ప్రభుత్వం భారీగా కేటాయింపులు చేసే అవకాశం ఉంది. నాడు-నేడు, వైద్యం, వ్యవసాయం.. వంటి పథకాలకు మరోసారి పెద్ద ఎత్తున నిధులను కేటాయించడం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications