ఓటుకు నోటు ఛార్జీషీట్లో బాస్: 'చంద్రబాబు రాజీనామా చేయాల్సిందే'
న్యూఢిల్లీ: ఓటుకు నోటు కేసులో ఎసిబి దాఖలు చేసిన ఛార్జీషీటులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేరు ఉన్నట్లుగా తెలుస్తోందని, ఆయన వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు జెడి శీలం బుధవారం నాడు డిమాండ్ చేశారు.
ఆడియో టేపుల్లో ఉన్నది తన గొంతు కాదని చంద్రబాబు ఇంతవరకు ఎందుకు చెప్పలేదని అన్నారు. ఆయన మాటల్లోనే తప్పు చేసినట్లుగా అర్థమవుతోందన్నారు. ఆయన తప్పు చేశాడని తాను చెప్పడం లేదని, ఆయన వ్యాఖ్యలే చెబుతున్నాయని అభిప్రాయపడ్డారు.
రూ.50 లక్షలు ఇచ్చింది రేవంత్ రెడ్డి కాదని కూడా ఆయన చెప్పడం లేదన్నారు. కేవలం ఎదురు దాడిని తప్పించుకోవడానికే చంద్రబాబు ప్రయత్నించారన్నారు. ఒకవేళ ఈ కేసులో నిర్దోషిగా చంద్రబాబు బయటపడితే మళ్లీ ముఖ్యమంత్రి పదవి చేపట్టవచ్చన్నారు.

ఓటుకు నోటు కేసుకు సంబంధించి వెలుగు చూసిన ఆడియో టేపుల్లో ఉన్నది చంద్రబాబు గొంతేనని ఫోరెన్సిక్ పరీక్షల్లో తేలిందన్నారు. కానీ, చంద్రబాబు మాత్రం ఇప్పటి వరకు దానిపై స్పందించలేదన్నారు. ఈ కేసులో ఇతర నిందితులతో పాటు చంద్రబాబు ఒకరన్నారు.
కాగా, ఓటుకు నోటు కేసులో మంగళవారం నాడు తెలంగాణ ఎసిబి న్యాయస్థానంలో ఛార్జీషీటు దాఖలు చేసింది.
ఇందులో చంద్రబాబు పేరు ప్రస్తావించినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. బాబు, బాస్, నాయుడు అనే పదాలను చంద్రబాబును ఉద్దేశించే వాడినట్లుగా ఎసిబి నిర్ధారణకు వచ్చినట్లు వార్తలొస్తున్నాయి.












Click it and Unblock the Notifications