Job calender :జాబ్ క్యాలెండర్‌పై భగ్గుమంటున్న నిరుద్యోగులు... మంత్రుల ఇళ్ల ముట్టడికి యత్నం...
జాబ్ క్యాలెండర్‌పై ఏపీలో నిరుద్యోగులు భగ్గుమంటున్నారు. ఆయా శాఖల్లో ఖాళీ ఉన్న 2లక్షల పైచిలుకు పోస్టులు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జాబ్ క్యాలెండర్‌పై ప్రభుత్వం పునరాలోచించాలని... లేనిపక్షంలో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. జాబ్ క్యాలెండర్‌ను నిరసిస్తూ నిరుద్యోగులు సోమవారం(జూన్ 28) కలెక్టరేట్లను ముట్టడించారు. అదే సమయంలో మంత్రుల ఇళ్లను ముట్టడించేందుకు యత్నించారు.
తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,విజయనగరంలో మంత్రి బొత్స సత్యనారాయణ,విశాఖపట్నంలో మంత్రి అవంతి శ్రీనివాస్ ఇళ్లను విద్యార్థి నేతలు ముట్టడించే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.

బీజేవైఎం నేతలు ఏపీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించగా పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు లక్షల పైచిలుకు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ... కేవలం 10వేల ఉద్యోగాలకు నోటీఫికేషన్ ఇవ్వడమేంటని బీజేవైఎం నేతలు ప్రశ్నించారు. ప్రతీ ఏటా లక్షలాది మంది విద్యార్థులు డిగ్రీలతో బయటకొస్తుంటే... ప్రభుత్వం నామమాత్రంగా ఉద్యోగాలను భర్తీ చేయడం సరికాదన్నారు. ప్రభుత్వం వెంటనే కొత్త జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఏపీ ప్రభుత్వం ఇటీవల 10,143 ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో గ్రూప్-1,గ్రూప్-2 పోస్టులు కేవలం 36 మాత్రమే ఉండటం,పోలీస్ శాఖలో కేవలం 450 ఉద్యోగాలు,మిగతావాటిల్లో ఎక్కువ శాతం టెక్నికల్ పోస్టులే కావడంతో నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కనీసం 25వేల టీచర్ పోస్టులు,3వేల గ్రూప్ 1,2 పోస్టులతో కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
జాబ్ క్యాలెండర్ మిస్‌ఫైర్ కావడంతో ఏపీ ప్రభుత్వం కూడా పునరాలోచనలో పడింది. జరిగిన డ్యామేజ్‌ను కవర్ చేయడానికి మెగా డీఎస్సీ నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఉద్యోగుల వేతనాలకు నిధుల కొరత ఉండటంతో... కొత్త ఉద్యోగాలకు నిధులు ఎలా అన్న విషయంపై సమాలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications