ఎపి సర్కార్ తీరు: నాడు పని ఆహారం స్వాహా, ఉపాధి హామీ భోజ్యం..
పేదలకు ఆసరాగా నిలిచే పథకాలు ఎన్ని అమలు చేసినా దళారుల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటంతో ముందడుగు పడటం లేదు.
హైదరాబాద్/ అమరావతి: పేదలకు ఆసరాగా నిలిచే పథకాలు ఎన్ని అమలు చేసినా దళారుల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటంతో ముందడుగు పడటం లేదు. 2000ల్లో కరువు నివారణ చర్యల కోసం 'పనికి ఆహారం' పథకం అమలులోకి తెచ్చారు. కానీ ఆ పథకం అమలు తీరులో అడుగడుగునా అవకతవకలే చోటు చేసుకున్నాయి.
అధికార పార్టీ కార్యకర్తలు, నాయకులకు బోజ్యంగా 'పనికి ఆహారం' పథకం సాగిందనే విమర్శలు వచ్చాయి. ఈ కోణంలోనే గ్రామీణ యువతకు ఉపాధి కల్పించేందుకు 2006లో నాటి యూపీఏ ప్రభుత్వం ప్రారంభించిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, అధికార పార్టీ నేతలే స్వాహా చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి. ఉపాధి హామీలో కూలీలుగా చేరిన వారికి నేరుగా బ్యాంకులు, పోస్టాఫీసుల ద్వారా వేతనాలు చెల్లించాలని, అవకతవకలకు చోటివ్వరాదని కఠినమైన నిబంధనలను ప్రవేశపెట్టారు.
కానీ ప్రభుత్వాధికారులు, అధికారంలో ఉన్న వారు తలుచుకుంటే కానిదేముంది. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పంట కుంటల తవ్వకం పేరిట కేవలం ఒక్క ఏడాదిలోనే దాదాపు రూ.వెయ్యి కోట్లు మింగేశారనే విమర్శలు పుష్కలంగా వినిపిస్తున్నాయి. ఈ పనులను గ్రామస్థాయి టీడీపీ నాయకులకు కట్టబెట్టడంతో 'మాకింత.. మీకింత' అని మరీ వాటాలు పంచుకుంటున్నారు. 'పంట కుంటల తవ్వకం పేరిట భారీగా ఈ అవినీతి బాగోతం సాగుతున్నదనే ఆరోపణలున్నాయి.
పేదల కుటుంబాలకు వారి సొంత గ్రామాల్లో పనుల కల్పన కోసం 'ఉపాధి హామీ పథకం'లో కేంద్రం 'పంట కుంటలు' నిర్మాణానికి నిధులిస్తున్నది. గత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం ఇచ్చిన ఉపాధి హామీ పథకం నిధులతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కలిపి 5,45,625 పంట కుంటలు తవ్వితే.. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 3,11,161 కుంటలు తవ్వినట్లు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. రూ.965.64 కోట్లు ఖర్చు చేసినట్లు చెబుతోంది.
రాష్ట్రంలో మరో 1,04,000 పంట కుంటలు నిర్మాణంలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లో ఫామ్‌పాండ్స్ తవ్వకాల్లో లెక్కలేనన్ని అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వ పెద్దల సహకారంతో ఈ పనులను దక్కించుకున్న అధికార టీడీపీ నేతలు నిబంధనలను తుంగలో తొక్కారని, ఒక కుంట తవ్వి, పదికుంటలు తవ్వినట్లు రికార్డుల్లో రాసేశారని విమర్శలు ఉన్నాయి.

ఒక్క ఏడాదే రూ.1.51 కోట్లు
ఈ పథకం అమలుచేసిన గ్రామాల్లో ప్రకాశం జిల్లా పొదిలి మండలం కంభాలపాడు ఒకటి. ప్రభుత్వ రికార్డుల ప్రకారం ప్రకాశం జిల్లాలో ఎక్కువ సంఖ్యలో ఫామ్‌పాండ్స్ తవ్విన మొదటి ఐదు గ్రామ పంచాయతీల్లో కంభాలపాడు ఒకటి. ఉపాధి హామీ పథకం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు 11 ఏళ్లలో ఈ గ్రామంలో ఈ పథకం కింద కూలీలకు రూ.3.79 కోట్లు చెల్లించగా, అందులో రూ.1.51 కోట్లు ఈ ఒక్క ఏడాదే పంటల కుంటల కోసం చెల్లించినట్లు రికార్డులు చెప్తున్నాయి.

ఆ రికార్డులు తప్పుల తడకలు
కంభాలపాడులో మొత్తం 322 పంట కుంటల పనులు చేపట్టగా, ఒక్క ఏడాదిలోనే 278 కుంటల తవ్వకం పూర్తి చేసినట్టు రికార్డులో తెలిపారు. గ్రామంలో పంటకుంటలు ఎక్కడ తవ్వాలనే వివరాలు కూడా నమోదు చేయకుండా పనులు మంజూరు చేశారు. వాటిని పూర్తి చేసి బిల్లులు కూడా చెల్లించారు. కానీ క్షేత్రస్థాయిలో ఈ మేరకు పంట కుంటలు కనిపించడం లేదు. నిబంధనల ప్రకారం ఒక కుంట తవ్వకానికి అనుమతి ఇచ్చేటప్పుడు దాన్ని ఏ రైతు పొలంలో తవ్వుతారన్న వివరాలను స్పష్టంగా పేర్కొనాలి. సంబంధిత రైతు ఉపాధి హామీ పథకంలో కూలీగా నమోదు చేసుకుని ఉండాలి. రైతు పొలం సర్వేనంబర్, కూలీ కార్డు సంఖ్య తప్పనిసరిగా తెలపాలి. బహిరంగ ప్రదేశాల్లో పనులకు అనుమతిచ్చినా, సంబంధిత ప్రాంతం గురించి స్పష్టమైన వివరాలతోపాటు సర్వే నంబర్ తదితర వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలి. కంభాలపాడులో 240 పంట కుంటలను ఏయే రైతుల పొలాల్లో తవ్వారన్న వివరాలను ప్రభుత్వ రికార్డుల్లో పొందుపరచలేదు. రికార్డుల్లో 83 మంది రైతుల పేర్లను నమోదు చేసినా, వారి ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు సంఖ్య స్థానంలో దొంగ నంబర్లు నమోదు చేశారు. ఏ సర్వే నంబర్ పరిధిలో 147 పంట కుంటలను తవ్వారన్న వివరాల్లేవు.

దొంగ జాబ్‌కార్డు నంబర్లు
కంభాలపాడులో పంట కుంటలను ఎక్కడ తవ్వారని స్థానిక అధికారులను అడిగితే వాగుల వైపే చూపుతున్నారు. తొలుత గ్రామంలోని చిన్న ఊట్ల వాగు ప్రాంతంలో 78, ఎర్రవంక వాగులో 70, పల్లెకంటి వాగులో 73 పంట కుంటలను తవ్వినట్టు చెప్పారు. చిన్న ఊట్ల వాగు, వాగుకు ఇరుపక్కల రైతుల పొలాల్లో కేవలం 28 పంట కుంటలు మాత్రమే కనిపించాయి. గ్రామంలో మొత్తం 13 కిలోమీటర్ల పరిధిలో ఉండే మూడు వాగుల్లో 211 కుంటలు తవ్వారా? అని అధికారుల వద్ద ఆరా తీస్తే.. తాము మొదట ఇచ్చిన సమాచారం తప్పుగా వచ్చిందని కొత్తగా మరొక జాబితాను అందజేశారు.

పొంతన లేని జాబితాలు
మలి జాబితాలో పెద్ద ఊట్ల వాగులో 48, ఎర్రవంక వాగులో 14తోపాటు ఒక్కొక్క రైతు పేరుతో నాలుగైదు కుంటలను తవ్వినట్లు పేర్కొన్నారు. విజయవాడలోని గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయంలో ఉన్న జాబితాకు, స్థానిక అధికారులిచ్చిన రెండు జాబితాలకు పొంతనలేదు. కమిష నర్ కార్యాలయంలోని జాబితాలో దొంగ జాబ్‌కార్డు నంబ ర్లు నమోదు చేయడం గమనార్హం. కూలీ జాబ్ కార్డులో ఉండే 18 అంకెల సంఖ్యను నమోదు చేయాల్సి ఉండగా, 9 అంకెల సంఖ్యలను మాత్రమే నమోదు చేశారు. రాష్ట్రంలో కొన్ని నెలలుగా ఉపాధి హామీ పథకంలో కేవలం పంట కుంటల తవ్వకం పనులకే ప్రభుత్వం అనుమతులు మంజూరు చేస్తోంది.
ఈ పథకానికి కేంద్రం ఇచ్చే నిధులతో కాంట్రాక్టర్ల ద్వారా పనులు చేయించకూడదని నిబంధనలు ఉన్నా గ్రామస్థాయిలో టీడీపీ నేతలు, వారి అనుచరులే ఈ పనులు దక్కించుకుంటున్నారు. ఉపాధి హామీ పథకం పనుల్లో యంత్రాల వాడకంపై నిషేధం ఉన్నా పంట కుంటలను యంత్రాలతో తవ్వి కూలీల పేరుతో బిల్లులు చేసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి హామీ పథకంలో పని చేసిన కూలీలకు రోజుకు రూ.129 చొప్పున కూలీ పడుతుండగా, కంభాలపాడులో కూలీలకు రోజుకు రూ.188 చొప్పున చెల్లింపులు జరిపినట్లు రికార్డుల్లో పేర్కొన్నారు. పంటకుంట చుట్టూ రాళ్లతో రివిట్‌మెంట్‌ను ఏర్పాటు చేయాల్సి ఉన్నా అటువంటిదేమీ కనిపించడం లేదు.

బోర్డులు పెట్టకుండానే బిల్లులు
ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పనుల వివరాలతో పని ప్రాంతంలో తప్పనిసరిగా బోర్డులు ఏర్పాటు చేయాలి. కంభాలపాడులో కేవలం ఒక్కచోట మాత్రమే బోర్డును ఏర్పాటు చేసినా, చిన్న ఊట్ల వాగుపై తవ్విన పంటకుంటకు పెద్ద ఊట్ల వాగులో తవ్వకానికి అనుమతిచ్చిన బోర్డును ఉంచారు తప్ప మిగిలిన చోట్ల ఎక్కడా బోర్డులు లేవు. గతేడాది పూర్తయిన పనుల వివరాలు తెలిపే బోర్డులు ఏర్పాటు చేయనేలేదు. ఆ పేరుతో మాత్రం రూ.500 చొప్పున బిల్లులు మాత్రం తీసుకున్నారు. దాని గురించి అధికారులను అడిగితే.. ఆర్డర్ ఇచ్చామని బదులిచ్చారు. అక్రమాలు బయటపడతాయనే ఉద్దేశంతోనే బోర్డులు ఏర్పాటు చేయలేదని గ్రామస్తులు చెప్తున్నారు.












Click it and Unblock the Notifications