మంత్రి పదవి ఇస్తే వస్తానన్నావు: ఎర్రబెల్లిపై రామన్న ఎదురుదాడి
హైదరాబాద్: అప్పుడు మంత్రి పదవి ఇస్తే టిఆర్ఎస్‌లో పార్టీలో చేరతానని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారని ఆ పార్టీ నేత, తెలంగాణ మంత్రి జోగు రామన్న విమర్శించారు. తమ పార్టీపై ఎర్రబెల్లి చేస్తున్న విమర్శలపై ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఎదురు దాడికి దిగారు. ఇప్పుడు టీఆర్ఎస్‌ను విమర్శించడానికి నోరు ఎలా వస్తోందని ఆయన అడిగారు.
ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఇతర ఎమ్మెల్యేలతో బేరసారాలు కుదుర్చుకోవాలని చూసిన రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని జోగు డిమాండ్ చేశారు. తెలంగాణపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుట్రలు చేస్తున్నాడని మంత్రి జోగు రామన్న మండిపడ్డారు. చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాడని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రం కొత్తగా ఏర్పడిన తర్వాత తెలంగాణకు రావాల్సిన కరెంట్ వాటా అడిగినపుడు చంద్రబాబు నాయుడు ఇవ్వనన్నాడని, అపుడు ఎర్రబెల్లి దయాకర్‌రావుతోపాటు తెలంగాణ టిడిపి నేతలు ఎవరూ మాట్లాడలేదని గుర్తు చేసారు. తెలంగాణ టీడీపీ నేతలు చంద్రబాబు వద్ద సేవకులుగా పనిచేస్తూ బానిస బతుకులు బతుకుతున్నారని విమర్శించారు.

రాజకీయ పబ్బం గడుపుకోవడానికే ఏపీ సీఎం తెలంగాణపై కుట్రలు పన్నుతున్నారని దుయ్యబట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని కోరుతూ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి లంచం ఇవ్వడం అప్రజాస్వామికమన్నారు. డబ్బు ఇస్తూ ఏసీబీకి దొరికిపోయినపుడు తనను చంద్రబాబు నాయుడే పంపించారని రేవంత్‌రెడ్డి అన్న మాటలు స్పష్టంగా వీడియోలో రికార్డయ్యాయని అన్నారు. మిగతా మొత్తం కోసం తమ అధినేతను సంప్రదించాలని కూడా అన్నాడని తెలిపారు. తెలంగాణ టిడిపి నేతలకు సిగ్గు ఉంటే ఇకనైనా ఆ పార్టీని వీడాలని హితవు పలికారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కుటుంబాన్ని విమర్శించే అర్హత ఎర్రబెల్లి దయాకర్‌రావుకు లేదని మంత్రి జోగు రామన్న మండిపడ్డారు. ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలంగాణ ద్రోహి అని ప్రజలు అన్న విషయాన్ని గుర్తు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు తొత్తులుగా వ్యవహరిస్తూ సీఎం కేసీఆర్ కుటుంబంపై విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎర్రబెల్లి, టీ టీడీపీ నేతలు చంద్రబాబుకు బ్రోకర్లుగా, ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.












Click it and Unblock the Notifications