కుమారుడి కోసం యోగా మాస్టర్‌ను చంపించిన జర్నలిస్టు
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం విమానాశ్రయం పరిధిలో దారుణ హత్య జరిగింది. ఉడా కాలనీలో దండగులు యోగా మాస్టర్ వెంకటరమణను రాడ్లతో కొట్టి చంపారు.
నడిరోడ్డు మీద అతన్ని హత్య చేశారు. ఈ హత్యకు సంబంధించిన దృశ్యాలు సిసిటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనా స్థలంలో క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్స్‌తో విచారణ చేపట్టారు.

దినపత్రిక విలేకరి పాత్ర...
వెంకటరమణ హత్య కేసులో ఓ సాయంకాలం దినపత్రిక విలేకరి హస్తం ఉందని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. వెంకటరమణకు యోగాలో మంచి ప్రావీణ్యం ఉంది. దాదాపు 14 ఏళ్లుగా యోగా మాస్టర్‌గా వ్యవహరిస్తున్నారు.

తల్లి మరణించడంతో వచ్చాడు...
తల్లి మరణించడంతో నాలుగేళ్ల క్రితం వెంకటరమణ వియత్నాం నుంచి విశాఖకు వచ్చారు. సాయంకాలం దినపత్రిక విలేకరి కూడా వియత్నాంలో యోగా గురువుగా వ్యవహరిస్తున్నాడు. దీంతో వియత్నాంలో తన కుమారుడు మాత్రమే యోగా గురువుగా స్థిరపడాలనే ఉద్దేశంతో వెంకటరమణను విలేకరి చాలా కాలంగా వేధిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

వియత్నాం తిరిగి వెళ్లకుండా..
విశాఖ నుంచి వెంకటరమణ తిరిగి వియత్నాం వెళ్లకుండా అతడి పాస్‌పోర్టును సీజ్ చేయించి తప్పుడు కేసులు పెట్టి వేధించినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. ఆ సమయంలో పోలీసులు వెంకటరమణను అరెస్టు చేసి పాస్‌పోర్టును కూడా సీజ్ చేశారు. పాస్‌పోర్టును తిరిగి పొందేందుకు వెంకటరమణ తీవ్రంగా ప్రయత్నించారు.

చివరకు కోర్టు ఇలా చెప్పింది...
చివరకు రూ. 5 లక్షలు డిపాజిట్ చెల్లించి పాస్‌పోర్టును తీసుకోవాలని కోర్టు వెంకటరమణకు సూచించింది. అందుకు వెంకటరమణ సిద్దపడ్డారు. అయితే, సెటిల్‌మెంట్ పేరుతో ఆ విలేకరి వెంకటరమణను కలిసినట్లు తెలుస్తోంది

రాత్రి మాట్లాడుకుందామని చెప్పి...
సెటిల్‌మెంట్ విషయంపై మాట్లాడుకుందామని గత రాత్రి వెంకటరమణను ఇంట్లోంచి పిలిపించి రోడ్డు మీదికి రాగానే ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు వ్యక్తులు ఇనుపరాడ్లతో దాడి చేశారుర. దీంతో వెంకటరమణ అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications