జూ ఎన్టీఆర్ ఎఫెక్ట్, తగ్గిన చంద్రబాబు: పవన్ కళ్యాణ్‌కూ పరాభవమా?
హైదరాబాద్: నాడు జూనియర్ ఎన్టీఆర్‌కు ఎదురైన పరాభవమే, నేడు జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు తెలుగుదేశం పార్టీ నుండి ఎదురవుతోందా? అనే చర్చ రాజకీయ వర్గాల్లోనే కాకుండా సామాన్యుల్లోను సాగుతోంది.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పైన ఇప్పటికీ విపక్షాలు పలు అంశాల పైన విమర్శలు గుప్పిస్తుంటాయి. అందులో ప్రధానంగా స్వర్గీయ ఎన్టీఆర్ ఆంశం. ఆయనను వెన్నుపోటు పొడిచారని దాదాపు ప్రతి సందర్భంలోను ఆరోపిస్తుంటారు.
ఆ తర్వాత ప్రధానంగా.. జూనియర్ ఎన్టీఆర్ పేరును ప్రస్తావిస్తారు. హీరో జూనియర్ ఎన్టీఆర్‌ను 2009 సార్వత్రిక ఎన్నికల్లో ఉపయోగించుకున్న చంద్రబాబు ఆ తర్వాత ఆయనను పక్కన పెట్టారని వైయస్సార్ కాంగ్రెస్, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు దుమ్మెత్తిపోసిన సందర్భాలు ఉన్నాయి.
ఆ తర్వాత, 2014 సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ బిజెపి - టిడిపి పార్టీలకు మద్దతుగా నిలిచి, ప్రచారం చేశారు. టిడిపి, బిజెపిలు తప్పు చేస్తే నిలదీస్తానని పవన్ కళ్యాణ్ అప్పుడే చెప్పారు.
ఆ తర్వాత రాజధానికి భూములు తీసుకోవడం పైన చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీశారు. సెక్షన్ 8 పైన ఏపీ ప్రభుత్వానికి షాకిచ్చారు. పైగా, తెలుగుదేశం పార్టీ ఎంపీలపై విమర్శలు గుప్పించారు.

దీంతో, బెజవాడ ఎంపీ కేశినేని నాని, కేంద్రమంత్రి సుజనా చౌదరి, కొనకళ్ల నారాయణ తదితరులు పవన్ కళ్యాణ్ పైన దుమ్మెత్తి పోశారు. అయితే, పవన్ కళ్యాణ్‌ను ఏమీ అనవద్దని చంద్రబాబు వారించారు. ఆయన వారించడానికి పలు కారణాలు ఉన్నాయని చెబుతున్నారు.
అందులో, ప్రధానంగా ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ వంటి వారిని చూపించి విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. అసలు విషయమై ఏమైనప్పటికీ రాజకీయంగా లబ్ధి పొందేందుకు ఇలాంటి వాటిని ఉపయోగించుకుంటారు. పవన్ కళ్యాణ్ విషయంలో అదే పునరావృతం అయితే విపక్షాలు మరింత ఎదురు దాడి చేస్తాయని భావించి ఉంటారని అంటున్నారు.
ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ విషయంలో విపక్షాలకు అలాంటి అవకాశం ఇవ్వవద్దనే చంద్రబాబు కాస్త తగ్గారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎక్కువ మంది టీడీపీ వారే జూనియర్ అభిమానులు, కానీ మెగా లేదా పవర్ స్టార్ అభిమానులు వేరు. దానికి తోడు ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు తగ్గారని అంటున్నారు.












Click it and Unblock the Notifications