జూనియర్ ఎన్టీఆర్ రోజూ టచ్‌లోనే ఉంటాడు: ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ను నందమూరి కుటుంబం దూరం పెట్టేసిందంటూ కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ కు, ఎన్టీఆర్ కు మధ్య దూరం బాగా పెరిగిందని, అలాగే కల్యాణ్ రామ్ తో కూడా దూరం పెరిగిందని, వీరిద్దరూ ఒకటిగా ఉంటున్నారని, నందమూరి కుటుంబ సభ్యులంతా ఒకటైతే, తారక్, కల్యాణ్ రామ్ ఒకటంటూ తెలుగు ఫిలింనగర్ లో ప్రతిరోజూ వార్తలు వస్తుంటాయి. బాలయ్య అన్ స్టాపబుల్ షోకు తెలుగులోని అగ్ర హీరోలంతా అతిథులుగా వచ్చారుకానీ తారక్, కల్యాణ్ రామ్ రాలేదు. వీరిమధ్య ఉన్న అంతరానికి ఇదే నిదర్శనమని కొందరు చెబుతుంటారు. ఇటువంటి సమయంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి జూనియర్ ఎన్టీఆర్ పై వ్యాఖ్యానించారు.
తానేంటే తారక్ కు బాగా ఇష్టం
ఓ మీడియా ఛానల్ కు పురందేశ్వరి ఇంటర్వ్యూ ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ తో మీ అనుబంధం ఎలా ఉంటుంది అన్న ప్రశ్న ఎదురుకాగా.. అత్తగా తనను తారక్ ఎంతో గౌరవిస్తాడని, పెద్దలంటే చాలా గౌరవమని, తానంటే బాగా ఇష్టమని చెప్పారు. అంతేకాకుండా పిల్లలందరితో ప్రతిరోజు టచ్ లోనే ఉంటామని, ప్రతిరోజు ఫోన్ చేస్తుంటామని, వీడియో కాల్స్ కూడా చేసుకొని మాట్లాడుకుంటామని వివరించారు. సినిమాలకు సంబంధించి తాను ఎన్టీఆర్ కు, కల్యాణ్ రామ్ కు ఎటువంటి సలహాలు ఇవ్వనని, ఇప్పటికే వారిని వారు బాగా నిరూపించుకున్నారని, వారి వృత్తిలో వారు ఒక స్థాయికి చేరుకున్నారని పురందేశ్వరి వెల్లడించారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమా విడుదలైనప్పుడు చూసి అది బాగుంటే వెంటనే ఫోన్ చేసి అభినందిస్తానని తెలిపారు.

సినిమాలపై పూర్తిగా దృష్టి
బాలయ్యకు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ తో కోల్డ్ వార్ నడుస్తోందంటూ కొన్నాళ్లుగా వార్తలు వస్తుండగా, తాజాగా పురందేశ్వరి చేసిన వ్యాఖ్యలతో అటువంటి వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టినట్లయింది. రాజమండ్రి ఎంపీగా, ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరి చాలా బిజీగా ఉన్నారు. కల్యాణ్ రామ్ అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ వార్2 తోపాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. వీటి తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో నటించబోతున్నారు. సోలో హీరోగా రూ.1500 కోట్ల కలెక్షన్లు రాబట్టాలనేది జూనియర్ ఎన్టీఆర్ లక్ష్యంగా ఉంది. అందుకే సినిమాలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు.












Click it and Unblock the Notifications