చినరాజప్ప మాట: దేవినేని ఉమకు జ్యోతుల నెహ్రూ ఎసరు?
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వస్తున్న జ్యోతుల నెహ్రూ దేవినేని ఉమా మహేశ్వర రావు మంత్రిత్వ శాఖకు ఎసరు పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఉప ముఖ్యమంత్రి చిన రాజప్ప మాటలను బట్టి ఆ విషయం అర్థమవుతోంది.
జ్యోతుల నెహ్రూకు నీటి పారుదల శాఖ అంటే ఇష్టమని చిన రాజప్ప అన్నారు. దీన్ని బట్టి జ్యోతుల నెహ్రూకు మంత్రి పదవి ఇచ్చి ఆయనకు నీటి పారుదల శాఖను అప్పగిస్తారనేది అర్థమవుతోంది. ప్రస్తుతం ఆ శాఖ దేవినేని ఉమా మహేశ్వర రావు వద్ద ఉంది. అయితే, జ్యోతుల నెహ్రూకు మంత్రి పదవి ఇస్తారో లేదో తెలియదని కూడా చిన రాజప్ప అన్నారు.

తూర్పు గోదావరి జిల్లా నుంచి ఇధ్దరు శాసనసభ్యులు టిడిపిలోకి వస్తున్నారని ఆయన అన్నారు. విడతల వారీగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు తమ తెలుగుదేశం పార్టీలోకి వస్తారని ఆయన చెప్పారు. మంత్రివర్గ విస్తరణపై తనకు సమాచారం లేదని ఆయన అన్నారు.
జ్యోతుల నెహ్రూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి తమ పార్టీలోకి రావడం ఎంతో మేలు చేస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కూడా భావిస్తున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందినవాడు, సీనియర్ కావడంతో జ్యోతుల నెహ్రూతో కాపు సామాజిక ఉద్యమకారుడు ముద్రగడ పద్మనాభాన్ని సులభంగా ఎదుర్కోవచ్చునని ఆయన భావిస్తున్నారు. జ్యోతుల నెహ్రూ పార్టీని వీడడం వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి నష్టమే.












Click it and Unblock the Notifications