ఆనందయ్యకు కేఏ పాల్ మద్దతు-నిర్బంధానికి వ్యతిరేకంగా ఉద్యమం-మందు తయారీపై శిక్షణ
నెల్లూరు ఆయుర్వేద కరోనా మందుతో ప్రాచుర్యం సంపాదించుకున్న డాక్టర్ ఆనందయ్యకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఇవాళ ఫోన్ చేశారు. ఆయనకు మద్దతు తెలిపారు. ఆనందయ్య నిర్బంధంపై కేఏ పాల్‌తో వివరాలు పంచుకున్నారు. దీనిపై స్పందించిన పాల్.. ఆయన నిర్బంధానికి వ్యతిరేకంగా ఉద్యమానికి పిలుపునిచ్చారు. అంతే కాదు కోర్టుల్లో సైతం పిటిషన్లు వేస్తానని ప్రకటించారు. ఆనందయ్యకు ఏమైనా జరిగితే ఏపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు.
Recommended Video

ఆనందయ్యకు కేఏ పాల్ ఫోన్
నెల్లూరు ఆయుర్వేద కోవిడ్ వైద్యుడు ఆనందయ్యకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఇవాళ ఫోన్ చేశారు. ఆయన తయారు చేస్తున్న మందును భారతీయులందరికీ అందించేందుకు తన వంతు సహకారం అందిస్తానన్నారు. ఈ సందర్బంగా ఏపీ పోలీసులు ఆనందయ్యను భద్రత పేరుతో నిర్బంధించడాన్ని కేఏ పాల్ తప్పుబట్టారు. ఆనందయ్యను కాపాడేందుకు ప్రతీ ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

సేవ్ ఆనందయ్య ఉద్యమం
ఆనందయ్య ప్రస్తుతం ప్రమాదంలో ఉన్నారని, పోలీసులు ఆయన్ను భద్రత పేరుతో నిర్బంధించి మాట్లాడనీయడం లేదని కేఏ పాల్ ఆరోపించారు. నెల్లూరు కలెక్టర్, ఎస్పీ కలిసి ఆనందయ్యను నిర్బంధించారన్నారు. ఆయన్ను ఎందుకునిర్బందించారు ?, ఎందుకు మాట్లాడనీయడం లేదని పాల్ ప్రశ్నించారు. ఆనందయ్యను రక్షించేందుకు సేవ్ ఆనందయ్య పేరుతో ఉద్యమం చేపడతానని పాల్ తెలిపారు. ఆనందయ్యను తక్షణం విడిచి పెట్టాలని జగన్, అమిత్‌షాకు మెసేజ్‌లు పెట్టాలని పిలుపునిచ్చారు. భారత్‌లో వైద్య సదుపాయాలు చాలా దారుణంగా ఉన్నాయని, అలాంటి సమయంలో ఆనందయ్యను దేవుడు వరంగా ఇచ్చాడని పాల్ తెలిపారు. ఆయుష్, ఐసీఎంఆర్ ఆనందయ్య మందుతో సైడ్ ఎఫెక్ట్‌స్ లేవని సమర్ధించాయని పాల్ గుర్తుచేశారు.

అమిత్‌షా, కోర్టులు జోక్యం కోరిన పాల్
ఆనందయ్యతో మాట్లాడిన తర్వాత ఆయన ఎలాంటి పరిస్ధితుల్లో ఉన్నారో తనకు అర్దమైందని పాల్ తెలిపారు. ఆనందయ్యను కాపాడేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, ఏపీ హైకోర్టు ఛీఫ్ జస్టిస్ గోస్వామి జోక్యం చేసుకోవాలని పాల్ కోరారు. ఆనందయ్యను కస్టడీ నుంచి విడిపించాలని పాల్ కోరారు. ఈ మేరకు హైకోర్టు, సుప్రీంకోర్టులో తాను పిటిషన్లు దాఖలు చేయనున్నట్లు పాల్ వెల్లడించారు. ఆనందయ్యను విడిపించే వరకూ తన పోరాటం కొనసాగుతుందన్నారు.

ఆనందయ్యకు ఏం జరిగినా జగన్‌దే బాధ్యత
ఆనందయ్యను భారీగా పోలీసులు చుట్టుముట్టాల్సిన అవసరమేముందని కేఏ పాల్ ప్రశ్నించారు. నెల్లూరు అధికారుల తీరుపై పాల్ అభ్యంతరం తెలిపారు. ఆనందయ్యకు ఏదైనా జరిగితే ఏపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్ బాధ్యత వహించాలని పాల్ డిమాండ్ చేశారు. ఆనందయ్య వైద్యానికి తన మద్దతు ఉంటున్నారు. ప్రస్తుత పరిస్ధితుల్లో ఆనందయ్యను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. అయితే పోలీసులు ఇలా నిర్బంధించడం మాత్రం సరికాదన్నారు.

ఆనందయ్య మందుపై పాల్ ట్రైనింగ్
ఆనందయ్య మందు తయారీపై ఔత్సాహికులకు శిక్షణ ఇచ్చేందుకు సైతం తాను సిద్ధంగా ఉన్నట్లు పాల్ వెల్లడించారు.
ఆనందయ్య మందు తయారీపై సోషల్ మీడియాలో శిక్షణ ఇస్తామన్నారు. అడవుల్లోకి వెళ్లి మందు తయారీ సామాగ్రి తీసుకొస్తే ఎలా తయారు చేయాలో శిక్షణ ఇస్తామని పాల్ తెలిపారు. ప్రస్తుతం కరోనాను ఎదుర్కొనే విషయంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి, వైద్య నిపుణులు విఫలమయ్యారని, అందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు.












Click it and Unblock the Notifications