ఈసారి 'కడప' వారిదేగా.?
ఏపీ ఎన్నికల శంఖారావం త్వరలోనే మోగబోతోంది. గత షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే ఎన్నికల నిర్వహణకు ఎక్కువ సమయం కూడా లేదు. అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరిగి రెండోసారి అధికారం దక్కించుకోవాలనే పట్టుదలను ప్రదర్శిస్తుండగా, ప్రతిపక్ష తెలుగుదేశం కూడా జనసేనను కలుపుకొని సమరానికి సిద్ధమవుతోంది. రేపో మాపో భారతీయ జనతాపార్టీతో పొత్తు ఖరారయ్యే అవకాశం ఉందనే అంచనాలో ఆ పార్టీ ఉంది. మూడు పార్టీలు ఒక కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలోకి దిగితే ఇటు కూటమి.. అటు వైసీపీ మధ్య హోరాహోరీ పోరు తథ్యమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప. ఉమ్మడి కడప జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు లోక్ సభ నియోజకవర్గాలు ఉన్నాయి. కడప నగరం నుంచి ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి, మైనారిటీ వ్యవహరాలశాఖ మంత్రి అంజాద్ భాషా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వైసీపీ తరఫున 2014, 2019 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. గత ఎన్నికల్లో నవాబ్ జాన్ అమీర్ బాబుపై 54,794 ఓట్లతో గెలుపొందగా, 2014 ఎన్నికల్లో సుధా దుర్గాప్రసాదరావుపై 45,205 ఓట్ల మెజారిటీని భాషా సాధించారు.

అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పాటైన తర్వాత కడప స్థానానికి 1952లో తొలి ఎన్నిక జరిగింది. అప్పటి నుంచి 2019 వరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆరుసార్లు విజయం సాధించగా తెలుగుదేశం పార్టీ నాలుగుసార్లు, ఇండిపెండెంట్ అభ్యర్థి ఒకసారి విజయం సాధించారు. 1994 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వ్యూహం మార్చి మైనారిటీ అభ్యర్థిని బరిలోకి దింపి ఘనవిజయాన్ని దక్కించుకుంది. కడప పట్టణం పరిధిలో మైనారిటీ అభ్యర్థులు ఎక్కువగా ఉండటంతో అప్పటి నుంచి ప్రధాన పార్టీలన్నీ తమ అభ్యర్థులుగా వారినే బరిలోకి దింపుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఎవరనేది ఖరారు కాకపోయినప్పటికీ వైసీపీ తరఫున మాత్రం అంజాద్ భాషానే బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తమను గెలిపిస్తాయనే ధీమాలో వైసీపీ ఉండగా, కూటమి బలంతో తాము గెలుస్తామనే నమ్మకంలో టీడీపీ ఉంది.












Click it and Unblock the Notifications