అది మనదే రాసిపెట్టుకోండి: సీఎం జగన్
ఏపీ ఎన్నికల నిర్వహణకు ఎక్కువ సమయం లేదు. రేపో, ఎల్లుండో నోటిఫికేషన్ రావచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ తరుణంలో అన్ని పార్టీలు తమ తమ వ్యూహాలను, ప్రతివ్యూహాలను సిద్ధం చేసుకుంటూ వస్తున్నాయి. రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం కు ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్యల్లాంటివి. ఓడిపోతే ఏమవుతుందనే అంశంపై ఇరు పార్టీలకు స్పష్టత ఉండటంతో కచ్చితంగా గెలిచి తీరాలనే పట్టుదలను ప్రదర్శిస్తున్నాయి. గెలవాలి.. గెలిచి తీరాలని తమ పార్టీ శ్రేణులకు కూడా ఉద్భోదిస్తున్నాయి.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప. ఉమ్మడి కడప జిల్లాలో రెండు లోక్ సభ నియోజకవర్గాలతోపాటు 10 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అందులో ఒకటైన రాజంపేట లోక్ సభ నియోజకవర్గంగా, అసెంబ్లీ నియోజకవర్గంగా కొనసాగుతోంది. ఇక్కడి నుంచి మేడా వెంకట మల్లికార్జున రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014, 2019 ఎన్నికల్లో ఆయన వరుసగా రెండుస్లారు విజయం సాధించారు.

2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీచేసి వైసీపీ అభ్యర్థి ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డిపై 11,617 ఓట్ల తేడాతో గెలుపొందారు. తర్వాత వైసీపీ టికెట్ తెచ్చుకొని 2019 ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీచేసి టీడీపీ అభ్యర్థి బత్యాల చెంగల్రాయుడుపై 35,272 ఓట్ల తేడాతో ఘనవిజయం సాధించారు. 1952లో అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పాటైన రాజంపేటలో మొదటిసారి కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా విజయం సాధించింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆరుసార్లు, ఇండిపెండెంట్ అభ్యర్థి ఒకసారి, స్వతంత్ర పార్టీ రెండుసార్లు విజయం సాధించాయి. ముఖ్యమంత్రి సొంత జిల్లా కాబట్టి సహజంగా ఉండే బలంతో మరోసారి తాము ఇక్కడ విజయం సాధిస్తామని, కచ్చితంగా రాసిపెట్టుకోండని సీఎం జగన్ అంటున్నారంటూ వైసీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. బీజేపీతో పొత్తు కుదిరితే కూటమి తరఫున తామే విజయం సాధిస్తామనే నమ్మకంలో టీడీపీ ఉంది. విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి మరి.












Click it and Unblock the Notifications