కడపలో ఘోర రోడ్డు ప్రమాదం... ఇన్నోవా-లారీ ఢీ.. నలుగురు అక్కడికక్కడే మృతి...
కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇన్నోవా-లారీ ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు.మైదుకూరు-బద్వేలు హైవేపై డి.అగ్రహారం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఇన్నోవా ప్రయాణికులు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి కడప జిల్లాలో ఓ వివాహానికి వెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఎదురుగా వచ్చిన లారీ చిత్తూరు నుంచి టమాటా లోడ్‌తో వెళ్తున్నట్లు చెప్పారు. డి.అగ్రహారం సమీపంలో స్పీడ్ బ్రేకర్ల కారణంగా రెండు వాహనాలు అదుపు తప్పి ఎదురెదురుగా ఢీకొన్నట్లు వెల్లడించారు. సమాచారం అందిన వెంటనే హుటాహుటిన అక్కడికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.
ఇటీవలి కాలంలో వరుస రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం అనంతపురం జిల్లాలోనూ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. లారీ-బొలెరో ఢీకొన్న ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. గుత్తి సమీపంలోని జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులను కర్ణాటకలోని గుల్బర్గాకు చెందిన లాయక్ అలీ, అష్రఫ్ అలీ.. కర్నూలు జిల్లాకు చెందిన కాశీం మహమ్మద్‌లుగా గుర్తించారు.

ప్రమాద సమాచారం అందగానే స్థానిక పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ప్రమాదంలో నుజ్జునుజ్జయిన బొలెరో వాహనం నుంచి మృతదేహాలను వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టమ్ నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బొలెరో వాహనం అనంతపురం నుంచి కర్నూలు వైపు వెళ్తుండగా రాంగ్ రూట్‌లో వచ్చిన లారీ ఆ వాహనాన్ని ఢీకొట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. అతివేగంతో ఢీకొట్టడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.రెండు నెలల క్రితం ఇదే అనంతపురంలో ఆర్టీసీ బస్సు సృష్టించిన బీభత్సంలో ఒకరు మృతి చెందారు. హిందూపురం నుంచి అనంతపురం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. జిల్లా కలెక్టర్ వద్ద రెండు కార్లు,ఓ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి
గత నెలలో నెల్లూరు జిల్లా గూడూరు సమీపంలోని జాతీయ రహదారిపై ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. రాజమండ్రికి చెందిన వీరయ్య, వరలక్ష్మి దంపతులు, మణికంఠ, స్వాతి దంపతులు ప్రాణాలు కోల్పోగా.. లిఖిత అనే యువతి గాయాలతో బయటపడింది. ఆ కుటుంబం దైవదర్శన నిమిత్తం తిరుమల వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన జరిగిన కొద్దిరోజులకే ఇదే నెల్లూరు జిల్లాలోని మర్రిపాడు మండలం బుదవాడ గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు కూలీలు మృతి చెందారు. వేగంగా దూసుకొచ్చిన ఓ కారు ఆటోను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.












Click it and Unblock the Notifications