ఏపీ ఉక్కిరిబిక్కిరి: నడివేసవికి ముందే 45 డిగ్రీలు
ఏపీలో రోజురోజుకూ ఎండ తీవ్రత అధికమౌతోంది. ఉక్కపోత జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నడి వేసవి రాకముందే రోళ్లు పగిలేలా ఎండలు కాస్తోన్నాయి. ప్రజలు రోడ్ల మీదికి రావాలంటే హడలిపోయే పరిస్థితి నెలకొంది. ఇది ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు. మున్ముందు ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు. ఉపరితల ఆవర్తనం వల్ల మొన్నటివరకు వర్షాలు పడ్డాయి గానీ ఇప్పుడు పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది.
ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రత దిమ్మతిరిగేలా చేస్తోంది. రికార్డుస్థాయిలో టెంపరేచర్ నమోదవుతోంది. 40 డిగ్రీల ఎండ కాయడం సాధారణమైపోయింది. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే స్థాయిలో ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఈ ఎండలకు వడగాల్పులు తోడవుతున్నాయి. వేడి గాలులు మరింతగా జనాన్ని ఇబ్బందులకు గురి చేస్తోన్నాయి. ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల్లో వేడిగాలులు, ఉష్ణోగ్రత పంజా విసురుతున్నాయి.

ఈ రెండు నెలల్లో ఎండ తీవ్రత 43 నుంచి 45 డిగ్రీల వరకు ఉండొచ్చనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. ఈ అంచనాలను నిజం చేస్తూ మంగళవారం కడప జిల్లా ఒంటిమిట్టలో 45 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో ఇదే అత్యధికం. కర్నూలు జి లద్దగిరి, నంద్యాల జిల్లా సంజామల 44. 2, తిరుపతి జిల్లా వరదయ్యపాలెంలో 43.8, మార్కాపురం జిల్లా అనుమలపల్లిలో 43 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
దీంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 262 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఎండ తీవ్రత మరింత ప్రభావం చూపుతుందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. నేడు రాయలసీమ, కోస్తా జిల్లాల్లో 42 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అన్నారు. శ్రీకాకుళం- 4, విజయనగరం- 19, పార్వతీపురం మన్యం- 14, అల్లూరి సీతారామరాజు- 1, పోలవరం- 4, అనకాపల్లి- 2, కాకినాడ- 1, తూర్పుగోదావరి- 1 మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయి. మరో 73 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ చెప్పారు.
ఎండ తీవ్రత నేపథ్యంలో బయటకు వెళ్లేప్పుడు తలకి టోపీ లేదా కర్చీఫ్, తెలుపు రంగు కాటన్ వస్త్రాలు ధరించాలని, ఎండ తీవ్రత కళ్లపై పడకుండా ఉండేలా సన్ గ్లాసెస్ ఉపయోగించాలని సూచించారు. డీహైడ్రేషన్ కు గురి కాకుండా మంచినీరు ఎక్కువగా తాగాలని, గుండె జబ్బులు, బీపీ, షుగర్ ఉన్నవారు ఎండలో తిరగకూడదని అన్నారు.












Click it and Unblock the Notifications