బరిలో బాబాయ్: జగన్ కంచుకోటలో చంద్రబాబు సవాల్
కడప ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డిని ఓడించాలనే పట్టుదలతో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో జగన్ ఆత్మస్థయిర్యాన్ని దెబ్బ తీయాలనేది ఆయన ప్లాన్.
కడప: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప ఎమ్మెల్సీ పోరు ఆసక్తికరంగా మారింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి కడప జిల్లాను కంచుకోటగా భావిస్తారు. అయితే, ఇప్పటికే ఆ కోటకు బీటలు వారాయి. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన ముఖ్యమైన నేతలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ స్థితిలో త్వరలో జరగబోయే కడప ఎమ్మెల్సీ ఎన్నికను తెలుగుదేశం పార్టీ చీఫ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
వైయస్ జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు సవాల్ విసిరేందుకు సిద్ధమయ్యారు. కడప ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా జగన్ ఆత్మస్థయిరాన్ని దెబ్బ తీయాలనేది చంద్రబాబు ఎత్తుగడగా కనిపిస్తోంది. అయితే, అంతే ప్రతిష్టాత్మకంగా జగన్ తీసుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా తన బలానికి, బలగానికి ఢోకా లేదని నిరూపించుకోవాలని జగన్ చూస్తున్నారు.
ప్రతిష్టాత్మకంగా తీసుకుని, తన బలగం చెదరలేదని నిరూపించుకోవడాకే అన్నట్లుగా తమ పార్టీ అభ్యర్థిగా తన బాబాయ్ వివేకానందరెడ్డిని పోటీకి దించారు. అయితే, తెలుగుదేశం పార్టీ నాయకులు మరో విధంగా తలపోస్తున్నారు. వివేకానంద రెడ్డిని ఓడిస్తే జగన్‌ను ఓడించినట్లే అవుతుందని వారు భావిస్తున్నారు.

తమ్ముళ్లకు చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు..
కడప జిల్లాలోని తెలుగు తమ్ముళ్లుకు చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. విజయం కోసం పక్కా ప్లాన్ వేశారు. పార్టీ అభ్యర్థిగా రవీంద్రనాథ్‌రెడ్డిని బరిలోకి దింపారు. వివేకానంద రెడ్డి మాత్రమే కాకుండా తెలుగుదేశం అభ్యర్థి రవీంద్రనాథ్ రెడ్డి కూడా పులివెందులకు చెందినవారే.

కడప జిల్లా బలం ఇదీ...
కడప జిల్లాలోని పది నియోజకవర్గాల పరిధిలో 50 మండలాలు ఉన్నాయి. వీటిలో ఎనిమిది మునిసిపాలిటీలు, కడప కార్పొరేషన్ ఉన్నాయి. ఎమ్మెల్సీ ఓటర్లకు సంబంధించి జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు అంతా కలిపి 854 మంది ఉన్నారు. వీరిలో వివిధ కారణాల వల్ల కొందరు ప్రస్తుతం జిల్లాలో లేరు. మొత్తం మీద 822 మంది ఓటర్లు లెక్క తేలారు. వీరిలో 400 మందిని ఇటీవల తెలుగుదేశం పార్టీ జిల్లా నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గరకు తీసుకుని వెళ్లారు. మిగిలిన వారిలో కొందరిని తమవైపుకు తిప్పుకుని జగన్ బాబాయ్ వివేకానంద రెడ్డిని ఓడించి బిటెక్ రవిని గెలిపించుకుంటామని చంద్రబాబుకు వారు హామీ ఇచ్చారు.

జగన్ ప్రయత్నం కూడా అదే...
తన వద్దకు వచ్చినవారంతా టిడిపికి ఓటేస్తారనే నమ్మకాన్ని చంద్రబాబు వ్యక్తం చేయలేదని అంటున్నారు. చంద్రబాబుకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే శిబిరాలు ఏర్పాటు చేశారు. జగన్ కూడా ఇదే వ్యూహంతో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ ఓటర్లలో చీలిక తేవడానికి ప్రత్నాలు చేస్తున్నారని అంటున్నారు. ఆయన కూడా శిబిరాలు పెట్టేందుకు సిద్ధపడినట్లు వార్తలు వస్తున్నాయి.

వైయస్ జగన్ నమ్మకం ఇదీ..
ఇప్పుడు తెలుగుదేశం పార్టీ శిబిరంలో 426 మంది ఉండగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శిబిరంలో 396 మంది ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. అయితే టీడీపీ శిబిరంలో ఉన్నవారిలో కనీసం 50మందికి పైగా తమ పార్టీ అభ్యర్థికే ఓటు వేస్తారని జగన్ అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో కడప ఎమ్మెల్సీ ఎన్నికలు ఉత్కంఠకు తెర తీశాయి.












Click it and Unblock the Notifications