జగన్‌కు ఉలుకెందుకో!: కళా వెంకట్రావు, ముద్రగడనైనా అరెస్ట్ చేస్తామని చినరాజప్ప
గుంటూరు: తూర్పు గోదావరి జిల్లా తునిలో రైలు దగ్ధం కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఆరుగురిని సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారని, ఘటనకు బాధ్యులైన మరికొందరిని కూడా అరెస్ట్ చేయనున్నట్లు హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేశారు.
మంగళవారం గుంటూరులో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. అమాయకులపై ఎలాంటి వేధింపులకు ప్రభుత్వం తావివ్వదని, ఘటన వెనుక రౌడీషీటర్ల ప్రమేయం ఉన్నట్లు తేలిందన్నారు. వీరిలో అధికశాతం మంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలేనని తెలిపారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు.
కొంతమంది రాజకీయ స్వప్రయోజనాల కోసం కులాన్ని రెచ్చగొడుతున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి విమర్శించారు. శాంతియుతంగా ఆందోళన చేస్తే ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు ఉండవని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఉన్మాదంతో వ్యవహరిస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.
ముద్రగడనైనా అరెస్ట్ చేస్తాం
ముద్రగడ డిమాండ్లపై బుధవారం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఏపీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. రిమాండ్ లో ఉన్న నిందితులపై కేసులు కొట్టేయడం ఎలా సాధ్యమో ముద్రగడే తెలపాలన్నారు. కోర్టులంటే ముద్రగడకు గౌరవం లేకుండా పోయిందని ఆయన విరుచుకుపడ్డారు.
సాధ్యం కాని డిమాండ్లు కోరుతున్నందున ముద్రగడ డిమాండ్లకు అంగీకరించే పరిస్థితే లేదని చినరాజప్ప స్పష్టం చేశారు. అవసరమైతే ముద్రగడపైనా కేసులు నమోదు చేసేందుకు వెనుకాడబోమని కూడా చినరాజప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. కాపులకు రిజర్వేషన్లిస్తామని హామీ ఇచ్చిన తాము చెక్కభజన చేస్తున్నామని ముద్రగడ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. క్రియాశీల రాజకీయాల్లో ఉన్న 30 ఏళ్ల పాటు ముద్రగడ చేసిన దానినే చెక్కభజన అంటారని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.

జగన్‌కు ఉలికిపాటెందుకో!: కిమిడి కళా వెంకటరావు
తుని ఘటనలో నిందితులను అరెస్టు చేస్తే ప్రతిపక్ష నాయకులు ఎందుకు ఉలిక్కిపడుతున్నారో అర్థం కావడం లేదని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావు ఎద్దేవా చేశారు. శ్రీకాకుళం జిల్లా రాజాంలోని ఆయన స్వగృహంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ముద్రగడ కాపు ఉద్యమాన్ని ప్రతిపక్షానికి అనుకూలంగా మార్చుతున్నారన్నారు.
ఎంతటివారున్నా వదిలే ప్రసక్తే లేదు: ఉమ
తుని సంఘటనలో ఎంతటి వ్యక్తులున్నా వారిని వదిలే ప్రసక్తే లేదని, తనతోపాటు ముద్రగడ పద్మనాభం కూడా దానికి అతీతులు కారని టిడిపి జాతీయ కార్యదర్శి బొండా ఉమామహేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఈ ఘటనలో ఎవరున్నా అరెస్టులు తప్పవని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications