హోదాపై తగ్గం: హరి, బీజేపీ ఇస్తామన్లేదని కన్నాట్విస్ట్
న్యూఢిల్లీ/రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో భారతీయ జనతా పార్టీ వెనుకడుగు వేసే ప్రసక్తి లేదని విశాఖపట్నం భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యుడు కంభంపాటి హరిబాబు మంగళవారం నాడు అన్నారు. అభివృద్ధిలో భాగంగానే ఏపీకి రైల్వే జోన్ కేటాయింపు అన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధిని అన్ని ప్రాంతాలకు విస్తరిస్తామని చెప్పారు. ఏడాది పాలనలో స్వచ్ఛ పాలనను అందించిన ఘనత ప్రధాని మోడీ ప్రభుత్వానిదేనని కితాబిచ్చారు.

కన్నా లక్ష్మీనారాయణ కొత్త వాదన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ ఎప్పుడూ చెప్పలేదని ఆ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. యూపీఏనే ప్రత్యేక హోదా హామీ ఇచ్చిందన్నారు. చట్టంలో లేదని ప్రత్యేక హోదా రాకపోవడం వల్ల ఏపీకి వచ్చే నష్టమేమి లేదన్నారు.
గతంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలన్ని నెరవేర్చారా అని ఆయన ప్రశ్నించారు. కొందరికి చేతగాక బీజేపీని దోషిగా చూపే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీ అభివృద్ధికి బీజేపీ కృషి చేస్తుందన్నారు.
పీఎంవో ప్రతిష్ట పెంచాం: అమిత్ షా
తమది ముందు చూపున్న ప్రభుత్వమని బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా న్యూఢిల్లీలో అన్నారు. తమ ప్రభుత్వం హయాంలో పీఎంవో ప్రతిష్టను పెంచామన్నారు. మోడీ ప్రభుత్వం క్రియాశీలతను ప్రపంచం గుర్తిస్తోందని చెప్పారు.
ఎవరి జోక్యాలు, ఒత్తిళ్లు లేకుండా మంత్రిత్వ శాఖలు పని చేస్తున్నాయని చెప్పారు. అందరికీ అందుబాటులో మోడీ ప్రభుత్వం ఉందని చెప్పారు. విధాన నిర్ణయాలతో సత్వర ఫలితాలు సాధిస్తున్నామన్నారు. అన్ని రంగాలలో గణనీయమైన ప్రగతిని సాధించామన్నారు. ద్రవ్యోల్ఫణాన్ని అరికట్టి, దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చామన్నారు.












Click it and Unblock the Notifications