వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏలె చిత్రకళలో మన సహచరులు: ఒక ఆత్మీయ భాషణం

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాదులోని కళాకృతి ఆర్ట్ గ్యాలరీలో మొన్న ముగిసిన లక్ష్మణన్న చిత్రకళా ప్రదర్శన చూశారా? నేను ఇవ్వాళే, ప్రదర్శన ముగిసినాక ఆ బొమ్మలు గోడమీంచి తీస్తున్న సందర్భంలో వెళ్లాను. ఈ ఛాయాచిత్రాలు అవే...

అన్న 'ఫెలో ట్రావెలర్స్' అని ఇంగ్లీషు టైటిల్ పెట్టారు. అది కూడా నాకు నచ్చింది. అయితే ఆ మాటకు నేనైతే 'సహచరులు' అనే అనువదించుకుంటాను. ఎందుకంటే ఈ చిత్రకారుడికి తన చిత్రంలోని మనుషులు పరాయివాళ్లు కాదు. తన వాళ్లే. అంతేకాదు, ఆ మనుషుల్లో, ఆ చైతన్య జీవంలో తానూ ఒక మనిషి.

అంతేకాదు, ఆ మనుషుల తాలూకు సౌందర్యం, కట్టు బొట్టు, పనీ పాట, విశ్రాంతి, చేతన...ఇవన్నీ తన జీవితంలోనివే. పరస్పరాధారభూతమైన తెలంగాణ జీవచిత్రాలివి. ఇంకా చెబితే, ఆ మనుషులంతా తన అన్నదమ్ములు, అక్కాచెల్లెండ్లు, మేనమామలు, ఉద్యమ సహచరులు కూడా. కాబట్టే లక్ష్మణన్న బొమ్మలన్నీ మనలోవెలుపలి జీవన సాహచర్యంలోని మనుషులను గుర్తుచేస్తాయి. యాది మరచిన పెద్దలను మళ్లీ కలుసుకునేలా చేస్తయి.

ఇదీ ఏలే సంతకం

ఇదీ ఏలే సంతకం

ఏలె లక్మణ్ సంతకం ఒక సైన్ బోర్డు ఆర్టిస్టు నుంచి ఇల్లస్ట్రేటర్ నుంచి సినిమా పోస్టర్ డిజైనింగ్ నుంచి మేలుకుని తెలంగాణ చిత్ర జీవితానికి ఒద్దికైన రీతిలో ఎదిగిన తీరు అపూర్వమే...ఇప్పుడు ఆ అక్షరాలు సుప్రసిద్దమైన చిత్రలేఖనానికి పెట్టింది పేరు.

సాముహికత ముద్ర

సాముహికత ముద్ర

కళాక్రుతిలో ఫెలో ట్రావెలర్స్...ఇది ఒంటరి ప్రదర్శణే అయినప్పటికీ అది మనందరి సామూహికతకు నిండైన ముద్ర. బ్రుందగానం.

ఉద్యమ మాతృక

ఉద్యమ మాతృక

పూల చీరతో సగర్వంగా నడుముకు చేతును ఆనించుకుని నిలబడ్డ మహిళ ఇప్పుడు తెలంగాణ తల్లి. లక్ష్మణ్ ఉద్యమ మాతృక.

గ్రామదేవతలకు పూజలు

గ్రామదేవతలకు పూజలు

గ్రామ దేవతలను పూజించే గ్రామీణ మహిళ నిమగ్నత నిబద్ధత ఇప్పుటి వర్తమాన ఉద్యమ సందర్భంలో బిడ్డల్ని కోల్పోయిన తల్లులందరి ఆకాంక్ష...ఆరాధన...

వెలుగు నీడలు

వెలుగు నీడలు

వెలుగు నీడలు పరుచుకున్న గ్యాలరీలో ముసలివాడి శాంతమైన దృక్కులు, గాఢమైన నలుపు తెలుపులు...వస్త్ర వర్ణాల శోభితము...

బతుకమ్మల జీవనశైలి

బతుకమ్మల జీవనశైలి

జుట్టు ముడివేసుకోవడంలో ఒక బలిమి, ఒక ఎరుక, ఒక ఉద్యుక్తత, సన్నద్ధము...ఇవన్నీ వర్తమాన తెలంగాణ చేతనను, ఇక్కడి మనుషుల ఉద్యమ సాహచర్యమునూ చెబుతాయి. అయితే రాజకీయ ప్రతీకే అయినా మామూలుగా చూస్తే ఈ బొమ్మ తల్లిని, అక్కను, వదిననూ గుర్తు చేస్తునే మన బతుకమ్మల జీవన శైలిని అలవోకగా యాది చేస్తయి.

పల్లె కన్నీరు పెడుతోందో..

పల్లె కన్నీరు పెడుతోందో..


గూనపెంకలు, బండి చక్రమూ, ముదురైన నీలపు తలుపులు....ఇవన్నీ మనదైన జీవితాన్ని పలు పార్శ్వాల్లో ఆవిష్కరిస్తూనే ఉంటయి. పక్కన గ్రామీణ వృత్తి కళాకారుడు...

బహుజన చిత్రిక

బహుజన చిత్రిక

ఆ నిలబడ్డ తీరు చూస్తే రాజరికం దరిదాపుల్లో ఉన్నట్టే ఉన్నది, రైతు, వృత్తిదారుడు, నేతకారుడు, బహుజనుల రాజ్యకాంక్షకు సిసలైన దర్పణంగానూ ఉన్నదీ చిత్రం. దూరంగా ఆధునిక నిర్మాణల చెంత గ్రామీణ వలస జీవితమూ కనిపిస్తుంది. ఇది కూడా ప్రపంచీకరణను చెబుతూ, అదే సమయంలో వేర్లు తెగిన స్థితినీ ఆవిష్కరిస్తున్నది. భిన్న అంశాలను చెబుతూ ఉన్నదున్నట్టుగా వర్తమానం ఆత్మను చూపుతాడు చిత్రకారుడు.

ఉండాల్సిన చోటే..

ఉండాల్సిన చోటే..

ఇవీ ఆ చిత్రాలేగానీ, ఒక ఆధునిక చిత్రకళా ప్రదర్శన ఎంత బాగా చేయాలో చేసిన స్థితిని అందునా తన సహచరులను ఎక్కడ నిలపాలో అక్కడ నిల్పానన్న చిత్రకారుడి విశ్వాసమూ కనిపించే విధానానికి ఈ ఛాయాచిత్రం ఒక ఉదాహరణ.

గ్యాలరీ వ్యక్తి..

గ్యాలరీ వ్యక్తి..

తల్లీబిడ్డల చిత్రం మమతానురాగాలకు, భద్రతకూ సాక్షం. ఇక ప్రదర్శన ముగుస్తున్నది. ఆ బొమ్మల చెంత ఉన్న వివరాలు తొలగిస్తున్న గ్యాలరీ వ్యక్తి...

విముక్తికి ప్రతీక..

విముక్తికి ప్రతీక..

ఇందులో విశ్రాంతి తీసుకుంటన్న తెలంగాణ మహిళ...ఉస్మానియా క్యాంపసులో పోటెత్తుతున్న యువత ఉద్యమ వివరాల పో్స్టరు...ఆ మహిళ కళ్లు తెరిచింది...ఫోన్లో తెలంగాణ రింగుటోన్....ఇదొక అపూర్వమైన ప్రతీక...తెలంగాణ తల్లి విముక్తికి మార్గం సుగమం అయిన వర్తమాన సందర్భ చిత్రమిది.

ముఖ్యమైనది ఏమిటంటే, ఇది సహచర ప్రపంచం. మట్టీ మనిషి కళా చైతన్యవంతమైన రాజకీయాల సమాహారం. అదే ఈ సహచరుల ప్రదర్శనా లక్షణం అని నా భావన. అయితే ఈ మనుషుల సాహచర్యం అంతానూ వర్తమాన చేతనకు ప్రతీకలు కూడా. గత రెండున్నర దశాబ్దాల అస్తిత్వ సోయిలోంచి ఎదిగి వచ్చిన మాత్రుకలే. ఇందులో కనిపించే ఉస్మానియా క్యాంపస్ చిత్రం ఇవ్వాళ్టి తెలంగాణ ఉద్యమ చేతనను ఆవిష్కరించే చిత్రమే.

ఇవన్నీ ప్రకాశవంతమైన ముదురు రంగుల్లో, ఆకుపోకవలే, సున్నమూ జాజూ వలే, పసును,ఎరుపు, ఆకుపచ్చల్లో, అలాగే వర్తమానంలో పెరిగిన స్పహ తాలూకు దళితబహుజన ఆత్మగౌరవ ప్రతీకలతో, పొడుస్తున్న పొద్దుతో సహా కనిపిస్తయి. దేశీయ జానపద జీవన కళా మాధ్యమాల అంశాల మేలుకొలుపులా ఉన్న ఆధునిక చిత్రకళా ప్రదర్శన ఇది. వీటిని చూడటం ఒక చూడ ముచ్చట. ఒక బతుకు కోలుపు. అలాయ్ భలాయ్.

బ్రోచరు కూడా అందంగా వచ్చింది. సుశీ తారు ముందు మాట తప్పక చదవాల్సిందే. అన్నట్టు, ఈ చిత్రాలు చాలా పెద్దవి. మామూలు మాటలో్లనైతే లైఫ్ సైజు కన్నాపెద్దవి లేదంటే ఇవి మన పెద్దర్వాజలకన్నా పెద్దవి. వీటిలో ఛాయాచిత్రకళను పోలిన వాస్తవిక జగత్తు ఉంటుంది. వాస్తవికతలో కనుమరుగవుతున్న మూలాలు, వేర్లు, సాంస్కతిక అంశాలు అలవోకగా ఆధునికతని కౌంటర్ చేస్తున్నట్టు ఉంటాయి. తద్వారా ఈ చిత్రాలు బహుముఖంగా మనల్ని చైతన్యపరుస్తాయి. ఆనందింపజేస్తాయి.

చివరగా ఒక మాట. ఈ చిత్రాలు త్వరలో ముంబయికి వెళుతున్నయి.. సుప్రసిద్ధ జహంగీర్ ఆర్టు గ్యాలరీలో నవంబర్ 19నుంచి 25 వరకు కొలువుదీరి అక్కడా "మన సహచరులు' మరెందరినో ఆకర్శించి బలమైన ముద్ర వేయాలని అభిలషిస్తూ, లక్ష్మణన్నకు అభినందనలు, కృతజ్ఞతలు. వారి సాహచర్యానికి అందరి తరపునా శుభాకాంక్షలు.

రాత, ఫొటోలు: కందుకూరి రమేష్ బాబు

English summary
A photo journalist and writer has expressed his feelings on an eminent painter Aele Laxman's exhibition.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X