రెండు రాష్ట్రాల్లో కొత్త పిసిసి!: సీమాంధ్ర పగ్గాలు కన్నాకు?

వెంటనే ఢిల్లీ బయలుదేరి రావాలని, సోమవారం ఉదయానికి అందుబాటులో ఉండాలంటూ మంత్రి కన్నాకు అధిష్ఠానం నుంచి పిలుపొచ్చిందట. దీంతో, గుంటూరులో ఉన్న కన్నా ఆదివారం రాత్రి హైదరాబాద్ బయలుదేరారు. సోమవారం ఉదయమే ఆయన ఢిల్లీ బయలుదేరేందుకు సిద్ధమయ్యారు.
రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ, సీమాంధ్రలకు వేర్వేరు పిసిసిలను ఏర్పాటు చేయాలని యోచిస్తున్న కాంగ్రెస్ అధిష్ఠానం కన్నాకు సీమాంధ్ర పిసిసి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అసెంబ్లీలో విభజన తీర్మానాన్ని ఆమోదింపజేసుకునేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని మార్చి ఆయన స్థానంలో మరొకరిని కూర్చోబెట్టాలని అదిష్టానం భావించింది. ఆ లిస్టులో కన్నాతో పాటు కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పేర్ల పైన ప్రచారం జరిగింది.
అప్పట్లో దిగ్విజయ్ సింగ్ మంత్రి కన్నాతో ఏకాంతంగా చర్చలు కూడా జరిపారట. తాజాగా, రాష్ట్ర విభజన కసరత్తు తుది దశకు రావటంతో రెండు రాష్ట్రాల్లో పార్టీకి కొత్త రూపురేఖలు తెచ్చేందుకు అధిష్ఠానం శ్రీకారం చుట్టింది. రెండు రాష్ట్రాల్లోనూ కొత్తగా పార్టీ అధ్యక్షులను నియమించాలని భావిస్తోంది. తెలంగాణ పిసిసి చీఫ్‌గా మంత్రి శ్రీధర్ బాబును నియమించాలని అధిష్ఠానం ఆలోచిస్తోందంటూ కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే.
అలాగే, సీమాంధ్ర పిసిసి చీఫ్‌గా కన్నా నియామకానికి అధిష్ఠానం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆయనకు ఢిల్లీ నుంచి పిలుపు అందినట్టు తెలుస్తోంది. కాగా, తెలంగాణ పిసిసి చీఫ్ పదవి తనకు వస్తున్నట్లు జరిగిన ప్రచారమంతా మీడియా సృష్టేనని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.












Click it and Unblock the Notifications