సిఎం అంటూ వార్తలు: మీడియాపై మంత్రి కన్నా గుర్రు
హైదరాబాద్: తాను ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్నట్లు వార్తలు రావడంపై రాష్ట్ర మంత్రి కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. తనను కలిసి మీడియా ప్రతినిధులపై ఆయన శుక్రవారం మండిపడ్డారు. ఆయన శుక్రవారంనాడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు ఆయనను కలిశారు.
తాను ముఖ్యమంత్రి రేసులో లేనని కన్నా లక్ష్మినారాయణ మీడియాతో అన్నారు. ముఖ్యమంత్రి అంటూ ప్రచారం చేసింది మీడియానే అని, ఈ వ్యవహారంపై వివాదం సృష్టించవద్దని ఆయన అన్నారు. మీడియాలో వచ్చిన వార్తలను తాను ఇప్పటికే చాలా సార్లు ఖండించినట్లు ఆయన తెలిపారు.

అంతకు మించి మీడియాతో మాట్లాడడానికి కూడా ఆయన ఇష్టపడలేదు. కన్నా లక్ష్మీనారాయణ ఇటీవల కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని ఢిల్లీలో కలిశారు. తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని ఆయన సోనియాను కోరినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ముఖ్యమంత్రి వర్గం ఆయనపై గుర్రుమంది.
మీడియాలో వచ్చిన వార్తలను ఆయన ఇదివరకే ఖండించారు. తాను ముఖ్యమంత్రి పదవిని కోరలేదని చెప్పారు. కాగా, గురువారంనాడు ఆయన తెలంగాణకు చెందిన పిసిసి మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌ను కలిశారు. ఈ సందర్భంగా కూడా ఆయన ఆ వార్తలపై వివరణ ఇచ్చారు. కన్నా లక్ష్మీనారాయణ ముఖ్యమంత్రి పదవి అడగడం లేదని డి. శ్రీనివాస్ కూడా స్పష్టం చేశారు. కాంగ్రెసుకు విధేయులైనవారిపై దుష్ప్రచారం చేస్తున్నారని కూడా ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications