ఢిల్లీలో పరువు తీశారు! వైసీపీ ట్రాప్‌లో.. జల్సాలు: టెంపరరీ సీఎం అంటూ బాబుపై కన్నా తీవ్ర వ్యాఖ్యలు
అమరావతి: ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం ఆయన అమరావతిలో మాట్లాడుతూ.. ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టుపెట్టారని చంద్రబాబుపై మండిపడ్డారు.
ఏనాడైనా అమరావతికి చంద్రబాబు దండం పెట్టారా? ఫొటోలో ఫోజుల కోసం పార్లమెంటుకు మొక్కుతారా? అని చంద్రబాబుపై కన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో చంద్రబాబును కలవడానికి ఎవరూ ముందుకు రాలేదని అన్నారు.

బాబు పరువు తీశారు
ఢిల్లీ వెళ్లి హేమామాలినిని కలిసి వస్తావా?.. ఏపీ సీఎంగా ఢిల్లీలో ఆంధ్రుల పరువు తీశారని చంద్రబాబుపై కన్నాలక్ష్మీనారాయణ దుయ్యబట్టారు. చంద్రబాబు లేఖతోనే ఉమ్మడి ఏపీ విభజన జరగిందని, ఏపీ ప్రయోజనాల కోసం చంద్రబాబు ఏనాడూ పోరాటం చేయలేదని కన్నా ఆరోపించారు.

తప్పులను కప్పిపుచ్చుకునేందుకు..
అధికారంలోకి రావడానికి అడ్డగోలు హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక అవినీతి అసమర్థ పాలన చేస్తున్నారని బాబుపై ధ్వజమెత్తారు. చంద్రబాబు తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు బీజేపీపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే మోడీపై పరోక్షంగా విమర్శలు మొదలుపెట్టారని కన్నా ఆరోపించారు.

ఆ భయంతో హైదరాబాద్ నుంచి పారిపోయి..
పోలవరం ప్రాజెక్టు జాప్యానికి చంద్రబాబు అసమర్థతే కారణమని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా బుక్కయ్యారని అన్నారు. ఆ భయంతోనే హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారని కన్నా ఎద్దేవా చేశారు.

టెంపరరీ సీఎం అంటున్నారు..
అమెరికాలో కూడా లేని రేట్లతో తాత్కాలిక భవనాల కోసం ఖర్చు చేస్తున్నారని, తాత్కాలిక భవనాలు కడుతున్న సీఎం చంద్రబాబును.. ఏపీ ప్రజలు టెంపరరీ సీఎంగా చూస్తున్నారని కన్నా వ్యాఖ్యానించారు. ప్రత్యేక విమానాల్లో తిరగడం తప్ప చంద్రబాబు.. ఏపీకి ఏమీ చేయలేదని దుయ్యబట్టారు. విదేశాల్లో తిరిగి ఎన్ని పెట్టబుడులు తెచ్చారని చంద్రబాబును కన్నా నిలదీశారు.

వైసీపీ ట్రాప్‌లో.. బీజేపీని దోషిగా..
వైసీపీ ట్రాప్‌లో టీడీపీ పడిపోయిందని కన్నా ఆరోపించారు. పథకం ప్రకారమే చంద్రబాబు కేంద్రంపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు బీజేపీని దోషి చూపించే ప్రయత్నం చేస్తున్నారని కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్రం నిధులతో జల్సా.. పన్నులు కార్యకర్తలకు
కేంద్రం ఇచ్చిన నిధులతో చంద్రబాబు జల్సా చేస్తున్నారని, ప్రజలు కట్టిన పన్నులు టీడీపీ కార్యకర్తలు పంచుకుంటున్నారని కన్నా ఆరోపించారు. ఏపీలో అప్రజాస్వామిక పాలన కొనసాగుతోందని, హోదాకు బదులు ప్యాకేజీ ఒప్పుకుంది చంద్రబాబేనని అన్నారు. ప్రత్యేక హోదా సంజీవని కాదని వ్యాఖ్యానించిందీ.. ప్యాకేజీ ఇచ్చినందుకు అసెంబ్లీలో అభినందన తీర్మానం చేసింది కూడా చంద్రబాబేనని అన్నారు.

చంద్రబాబే మునిగిపోతున్నారు..
చంద్రబాబు తన హేరిటేజ్ సంస్థను ఎందుకు హైదరాబాద్ నుంచి విజయవాడకు తీసుకురావడం లేదని కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. బీజేపీని ముంచాలని చూస్తూ.. చంద్రబాబు మునిగిపోతున్నారని అన్నారు. చంద్రబాబు మోసాలను ప్రజలు గమనించాలని అన్నారు. రైల్వే జోన్ ఇస్తామని ఎన్నడూ బీజేపీ చెప్పలేదని, పోలవరం ముంపు ప్రాంతాలను ఏపీలో కలిపింది బీజేపీనేనని కన్నా స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications