ఎల్లుండి టీడీపీలో చేరుతున్నా-కన్నా ప్రకటన-జగన్ సర్కార్ పై అటాక్ మొదలు..
ఏపీలో తాజాగా బీజేపీకి గుడ్ బై చెప్పేసిన సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ ఎల్లుండి టీడీపీలో చేరబోతున్నట్లు ఇవాళ ప్రకటించారు.
ఏపీలో మాజీ బీజేపీ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే టీడీపీ మాజీ మంత్రి ఆలపాటి రాజా నిన్న ఆయన్ను కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. దీనికి అంగీకరించిన కన్నా.. ఇవాళ కీలక ప్రకటన చేశారు. ఎల్లుండి టీడీపీలో చేరబోతున్నట్లు కన్నా ప్రకటించారు.
ఎల్లుండి మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో టీడీపీ ప్రాంతీయ సమావేశం ఉంది. ఈ సమావేశంలో కన్నా లక్ష్మీనారాయణ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్ధం పుచ్చుకోనున్నారు. ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. తనతో పాటు చాలా మంది నేతలు టీడీపీలో చేరతారన్నారు. అదే సమయంలో టీడీపీలో చేరకముందే వైసీపీ సర్కార్ పై కన్నా విమర్శల దాడి మొదలుపెట్టేశారు. ముఖ్యంగా నిన్న చోటుచేసుకున్న గన్నవరం టీడీపీ కార్యాలయం దహనాన్ని కన్నా ఖండించారు. ఈ వ్యవహారంపై వైసీపీ సర్కార్ తీరుపై కన్నా విమర్శలు చేసారు.

గన్నవరం టీడీపీ ఆఫీసు దహనం వైసీపీ ఫ్యాక్షన్ సంస్కృతికి నిదర్శనమని కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు.
రాష్ట్రంలో పులివెందుల సంస్కృతిని తీసుకొచ్చారని, ఫ్యాక్షన్ సంస్కృతిని సీఎం జగన్ పెంచి పోషిస్తున్నారని కన్నా ఆరోపించారు. గన్నవరం టీడీపీ ఆఫీసు దహనాన్ని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. టీడీపీ నేత పట్టాభి విషయంలో డీజీపీ వైఖరి సరికాదని కన్నా తెలిపారు. దీంతో వైసీపీ సర్కార్ పై టీడీపీలో చేరకముందే కన్నా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.












Click it and Unblock the Notifications