మాట తప్పారు: రెబల్ అభ్యర్ధి కన్నబాబు, అసంతృప్తి నిజమేనన్న గంటా
విశాఖపట్నం: విశాఖపట్నం స్థానిక సంస్థల కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. తెలుగుదేశం పార్టీకి చెందిన కన్నబాబు రాజు సోమవారం స్వతంత్ర్య అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడమే ఇందుకు కారణం.
నామినేషన్ అనంతరం కన్నబాబు మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీటును తనకు కేటాయిస్తానని చెప్పిన అధిష్టానం మాట తప్పిందని అందుకే రెబల్ అభ్యర్ధిగా బరిలోకి దిగుతున్నానని చెప్పారు.
రాష్ట్ర విభజన అనంతరం మొదటి ఎమ్మెల్సీ సీటు తనకే ఇస్తానని మంత్రి నారాయణ హామీ ఇచ్చారని, ఇచ్చిన మాట తప్పడం వల్లే స్వతంత్ర్య అభ్యర్ధిగా నామినేషన్ వేసినట్లు తెలిపారు. పార్టీ కార్యకర్తలే తన బలమన్న కన్నబాబు, అన్ని పార్టీల మద్దతు తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

కన్నబాబు నామినేషన్‌పై మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టీడీపీలో కొందరు నేతల్లో అసంతృప్తి ఉన్న మాట నిజమేనని వ్యాఖ్యానించారు.
అన్ని పరిస్ధితులనూ పరిగణనలోకి తీసుకునే, ఎమ్మెల్సీ టిక్కెట్లను సీనియర్లకు కేటాయించాలని అధిష్టానం నిర్ణయించిందని ఆయన తెలిపారు. తనకు టికెట్ దక్కలేదని కన్నబాబు రాజులో కొంత మేరకు అసంతృప్తి ఉండవచ్చని చెప్పారు.
కన్నబాబు పోటీ విషయాన్ని సాయంత్రం సీఎం చంద్రబాబుతో మాట్లాడనున్నట్లు తెలిపారు. కన్నబాబు నామినేషన్ వేసినా.. ఉప సంహరించుకుంటారని గంటా అన్నారు. ఒకవేళ పోటీ తప్పనిసరైన పరిస్ధితుల్లో టీడీపీ అభ్యర్ధి భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని చెప్పారు.












Click it and Unblock the Notifications