ముద్రగడతో పెద్దిరెడ్డి భేటీ: చేరికకు సై- షరతులు..?!
కాకినాడ: కాపు రిజర్వేషన్ల సాధన సమితి నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం.. రాజకీయాల్లోకి పునః ప్రవేశించబోతోన్నారు. సుదీర్ఘకాలం పాటు రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన ఆయన రీ ఎంట్రీ ఇవ్వబోతోన్నారు. మళ్లీ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్రను పోషించనున్నారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ పునరాగమనాన్ని ప్రకటించే అవకాశం ఉంది.
చంద్రబాబు ప్రభుత్వంలో కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమించినప్పుడు ముద్రగడకు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. పోలీసులు ఆయనను గృహ నిర్బంధంలో ఉంచారు. 2014 నాటి సార్వత్రిక ఎన్నికల ప్రచార సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ ముద్రగడ పద్మనాభం ఉద్యమించారు. ఛలో అమరావతి పాదయాత్రకు పూనుకున్నారు. అప్పట్లో ఆయనకు అడుగడుగునా అవాంతరాలు ఎదురయ్యాయి.

పాదయాత్రకు బయల్దేరిన ముద్రగడను పోలీసులు అడ్డుకుని వారం రోజుల పాటు గృహ నిర్బంధంలో ఉంచారు. తుని వద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసినప్పటికీ- అది కూడా విఫలమైంది. ఆ తరువాత కూడా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశిస్తూ పలుమార్లు బహిరంగ లేఖలను రాశారు. ఆయా పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి పూర్తిగా దూరం అయ్యారు.
కాపు సామాజిక వర్గానికి చెందిన బలమైన నేత కావడం వల్ల ఆయనను పార్టీలో చేర్చుకోవడానికి అటు వైఎస్ఆర్సీపీ అగ్ర నాయకత్వం ఆసక్తిగా ఉంది. త్వరలోనే ఆయన అధికార పార్టీ కండువాను కప్పుకొనే అవకాశాలు లేకపోలేదంటూ గతంలోనూ వార్తలొచ్చాయి గానీ అవి వాస్తవ రూపాన్ని దాల్చలేదు. ఇప్పుడున్న పరిస్థితులు వైఎస్ఆర్సీలో చేరడానికి అనుకూలంగా ఉన్నట్లు ముద్రగడ్డ వర్గీయులు భావిస్తోన్నారు.
దీనికి కారణం లేకపోలేదు. తునిలో రైలు దగ్ధం కేసులన్నింటినీ జగన్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పెట్టిన కేసులన్నింటినీ- అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే వెనక్కితీసుకుంది. ఇటీవలే రైలు దగ్ధం కేసును కూడా కోర్టు కొట్టేసింది. దీనితో తనపై ఎలాంటి ఒత్తిళ్లూ లేవని, రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి ఇదే మంచి సమయం అనే అభిప్రాయంలో ముద్రగడ ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ పరిణామాల నేపథ్యంలో- తాజాగా వైఎస్ఆర్సీపీ లోక్‌సభ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి.. ఆయనతో సంప్రదింపులు చేపట్టారు. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో గల ముద్రగడ నివాసానికి వెళ్లారాయన. ముద్రగడతో పాటు ఆయన అనుచరులతో సంప్రదింపులు జరిపారు. వైఎస్ఆర్సీపీలో చేరాలంటూ మిథున్ రెడ్డి ఈ సందర్భంగా ఆయనను ఆహ్వానించినట్లు చెబుతున్నారు.
దీనిపై ముద్రగడ సానుకూలంగా స్పందించారని, త్వరలోనే తన నిర్ణయాన్ని తెలియజేస్తానని హామీ ఇచ్చారనే ప్రచారం జిల్లా రాజకీయాల్లో సాగుతోంది. వైసీపీలో చేరడంపై కాపు రిజర్వేషన్లకు సంబంధించిన కొన్ని కండిషన్లు పెట్టే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. వాటిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచి హామీని పొందిన తరువాతే వైసీపీ కండువా కప్పుకొంటారని సమాచారం.












Click it and Unblock the Notifications