వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాపు కోటా: భవిష్యత్తులో చంద్రబాబుకు సవాళ్లు తప్పవా?

|
Google Oneindia TeluguNews

అమరావతి: రిజర్వేషన్ల విషయంలో బాబు తొందరపడ్డారా?...పెనం మీద నుంచి తప్పుకునేందుకు పొయ్యిలోకి దూకారా? కాపు రిజర్వేషన్ల అంశం ముందు ముందు ఎలాంటి పరిణామాలకు దారి తీయబోతోంది. వాటి పర్యవసానాలు టిడిపి ప్రభుత్వంపై ఏ విధమైన ప్రభావాన్ని చూపనున్నాయి? ఈ ప్రశ్నలన్నింటికీ జవాబు...ముందు ముందు పరిస్థితులు చంద్రబాబుకు ప్రతికూలంగానే ఉండబోతున్నాయంటున్నారు మేధావులు...ఏ నిర్ణయమైనా ఆచి తూచి తీసుకునే చంద్రబాబు రిజర్వేషన్ల విషయంలో మాత్రం ఒక వైపే ఆలోచించారని దూరదృష్టితో వ్యవహరించలేదనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో తాను ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితి నుంచి బైటపడేందుకు మరో మార్గం లేకపోవడమే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమని వారే అంటున్నారు. ఏదేమైనా కాపులకు రిజర్వేషన్లు కల్పించడం, బోయలను ఎస్టీల్లో చేర్చడం ఈ రెండు విషయాల్లో చంద్రబాబు తీసుకున్న నిర్ణయం ప్రస్తుతానికి ఆయన ప్రత్యర్థులపై పైచేయి సాధించినట్లు కనిపిస్తున్నా దీర్ఘకాలంలో మాత్రం టిడిపి ఓటు బ్యాంకు సమీకరణాల్లో ఊహించని మార్పులు తీసుకురావడం ఖాయమనేది వారి విశ్లేషణ. మరోవైపు పులిమీద పుట్రలా మిత్రపక్షమైన బిజెపితో ఇప్పటికే ఏర్పడిన కమ్యూనికేషన్ గ్యాప్ మరింత పెరగడానికి కూడా ఈ కాపు రిజర్వేషన్ల అంశం ఒక కారణమవుతుందని విశ్లేషిస్తున్నారు.

 తొందరపాటు నిర్ణయమే...

తొందరపాటు నిర్ణయమే...

ప్రభుత్వం పూర్తి స్థాయిలో అధ్యయనం చేయకుండా రిజర్వేషన్ల నిర్ణయాన్ని ప్రకటించి ప్రజల మధ్య చిచ్చురేపుతోందని పిసిసి అధ్యక్షుడు ఎన్‌.రఘువీరారెడ్డి విమర్శ. ఇప్పడు ఇదే విమర్శ అటు బిసిల నుంచే కాదు .....ఇటు కాపుల నుంచి కూడా వినిపిస్తుండమే టిడిపి అధినేత చంద్రబాబుకు మొదటి ప్రమాద ఘంటిక. కాపులను బిసిల్లో, బోయలను ఎస్టీలో చేర్చేందుకు ప్రభుత్వం వేసిన కమిటీ పూర్తి నివేదిక ఇంకా రాలేదన్నారు. నివేదిక ఇవ్వకుండానే రిజర్వేషన్ల మార్పు పేరుతో ప్రభుత్వం హడావుడి చేయడం ఎందుకనేది రఘువీరా ప్రశ్న. కేవలం పోలవరం నుంచి దృష్టి మళ్లించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రతిఒక్కరికి అర్థమవుతోందని రఘువీరా ఆరోపించారు.

 కాపుల నుంచి కూడా భిన్న స్వరాలే...

కాపుల నుంచి కూడా భిన్న స్వరాలే...

కాపుల రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చిన తర్వాతే నిజమైన పండగని కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమాలు చేసిన ముద్రగడ పద్మనాభం కుండబద్దలు కొట్టారు. కాపుల జనాభాను ఉద్దేశ్యపూర్వకంగా తక్కువ చేసి చూపించారనేది ముద్రగడ చేస్తున్న ప్రధాన ఆరోపణల్లో ఒకటి కాగా అలా తక్కువ చేసి చూపడం ద్వారా ఐదు శాతం రిజర్వేషన్లతో సరిపెట్టారనేది మరో విమర్శ. రాష్ట్రంలో కోటికి పైగా జనాభా ఉన్న కాపులకు ఐదుశాతం రిజర్వేషన్లు ఏమాత్రమూ సరిపోవని, 10 శాతం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తుండటం గమనార్హమే. ముందు ముందు కాపుల వైపు నుంచి ఈ అంశాలపై ఒత్తిడి ఎదుర్కోకతప్పేలా లేదు.

 బిసీల ఆందోళన ఇది....

బిసీల ఆందోళన ఇది....

కాపులను బీసీల్లో చేర్చుతూ తీసుకున్న ప్రభుత్వ నిర్ణయంపై బీసీలు మండిపడుతున్నారు. టిడిపి ప్రభుత్వంలో భాగస్వాములైన బిసీ నాయకులు తప్ప మరెవరూ కాపు రిజర్వేషన్ల వల్ల తమకు ఇబ్బంది లేదని మాటవరసకు కూడా అనలేకపోతున్నారు.

అయితే ప్రభుత్వ పదవుల్లో ఉన్న ప్రజా ప్రతినిధులు కూడా ఆఫ్ ది రికార్డు చర్చల్లో తాము నియోజకవర్గాల్లో తిరగాలంటే భయపడాల్సిన పరిస్థితి ఉందని, ఎక్కడ ఎవరు ఎలా ప్రతిస్పందిస్తారో తెలియడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది.

మంజునాథ కమిషన్ నుంచి నివేదిక తన ఊహకు భాన్నంగా వుందన్న సమాచారంతో చంద్రబాబు హడావుడిగా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని బిసి నేతలు ఆరోపిస్తున్నారు. మంజునాథ కమిషన్‌ అధ్యక్షుడైన మంజునాథ్‌ లేకుండా కొంతమంది సభ్యులతో ఆదరాబాదరగా కేబినెట్‌ టేబుల్‌ నోట్‌ కింద అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశ పెట్టడం ఓ పథకం ప్రకారం జరిగిందని రాష్ట్ర బీసీ సంఘాల కన్వీనర్‌ కుడుపూడి సూర్యనారాయణరావు ఆరోపిస్తుండటం గమనార్హం. కాపులకు రిజర్వేషన్‌ కల్పిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకుంటున్న సమయంలో కనీసం మాట్లాడలేని బీసీ ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసి ఆ పార్టీ నుంచి బయటకు రావాలని బీసీ సంఘ నాయకుల డిమాండ్‌ చేస్తుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

 ఆందోళనలపై ఆందోళన..

ఆందోళనలపై ఆందోళన..

కాపు ,వాల్మీకి,బోయలకు రిజర్వేషన్లతో చంద్రబాబు ప్రభుత్వం సమస్యల తేనెతుట్టె కదిపినట్టయింది. కాపులను బిసిలుగా గుర్తిస్తూ ఐదుశాతం రిజర్వేషన్లు కల్పించడంపై బిసి సంఘాల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతుండగా బోయ, వాల్మీకులను ఎస్టీలో చేర్చడాన్ని ఆదివాసీ సంఘాలూ వ్యతిరేకిస్తున్నాయి.

ఇటు ప్రభుత్వ కాపులు కాని వారు కూడా రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో కాపు రిజర్వేషన్లను చేరిస్తేనే తమకు ప్రయోజనం లభిస్తుందని స్పష్టం చేస్తున్నారు. కాపు రిజర్వేషన్లపై శాసనసభ తీర్మానం చేసిన వెంటనే పెద్ద ఎత్తున బిసి సంఘాలు ఆందోళనలకు దిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించడంతో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో అప్రమత్తమైనట్లు తెలిసింది.

రాష్ట్ర వ్యాప్తంగా బిసి సంఘాల నేతలపై నిఘా పెట్టడంతో పాటు బిసి కమిషన్‌ కార్యాలయం పై కూడా నిఘా అధికారులు దృష్టి సారించారట. విజయవాడలో బిసి సంఘం నాయకుడు, జనసేన పార్టీ కార్యకర్త పోతిన మహేష్‌ను పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. హైదరాబాద్‌లో బిసి సంఘ నేత ఆర్‌. కృష్ణయ్య కూడా ఘాటుగా స్పందించారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. అవసరమైతే తెలుగుదేశం పార్టీకి, ఎంఎల్‌ఏ పదవికి రాజీనామా చేస్తానని ఆయన హెచ్చరించారు. ఈ విషయమై న్యాయపోరాటం చేస్తానని ఆయన అన్నారు.

 ఓటు బ్యాంకు సమీకరణాల్లో మార్పు?

ఓటు బ్యాంకు సమీకరణాల్లో మార్పు?

తెలుగు దేశం పార్టీకి మొదటి నుంచి బిసిలే ప్రధాన బలం. అందువల్లే ఒకానొకదశలో 294 అసెంబ్లీ స్థానాలకు 100 సీట్లు బిసిలకు ఇచ్చిన పరిస్థితి. అంతేకాదు గత ఎన్నికల సందర్భంగా తెలంగాణా టిడిపి కోసం బిసి నేత కృష్ణయ్యని ఏరికోరి తెచ్చుకోవడమే కాదు ఏకంగా సిఎం అభ్యర్థిగా ప్రకటించారు.

ఆ చర్యలన్నీ ఇక్కడి బిసిల ఓటు బ్యాంకును మరింత పటిష్టం చేసుకోవడానికే...మరి అలాంటి బిసిలు కాపు రిజర్వేషన్లతో టిడిపి పట్ల తమ సానుకూల అభిప్రాయాన్ని మార్చుకుంటే టిడిపికి ఖచ్చితంగా గడ్డుకాలమే. మరోవైపు ప్రతిపక్ష వైసిపి కూడా ఈ సంక్లిష్ట పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం ప్రారంభించింది.

జగన్ ఒక వైపు కాపులకు మద్దతిస్తామంటుండగానే మరోవైపు ఆ పార్టీ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ బిసి లందరూ రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి సన్నధ్దం కావాలని పిలుపునిచ్చారు. దీంతో బిసి లందరూ ఐక్యం కావడానికి కాపు రిజర్వేషన్ల అంశమే కారణం కాబోతుందని పరిశీలకుల అంచనా. బిసి లందరూ ఏకతాటిమీదకు వచ్చి రాజకీయ ప్రాబల్యం గురించి ప్రశ్నిస్తే అప్పుడు వారి మాటకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వక తప్పని పరిస్థితే ఉంటుంది. పైగా ఇలా కులాల వారీగా చైతన్యం పెరిగితే కొత్త సమీకరణాలకు దారితీయవచ్చని మరో విశ్లేషణ.

 కేంద్రం కోర్టులో బంతి...

కేంద్రం కోర్టులో బంతి...

ప్రజెంట్ ఫార్మాట్లో కాపు రిజర్వేషన్లు అమల్లోకి రావాలంటే కేంద్ర ప్రభుత్వ తోడ్పాటు వుంటేనే సాధ్యం లేకపోతే అసాధ్యం అనేది అందరికి తెలిసిన విషయమే. కేంద్రం నుంచి ఇబ్బంది ఎదురైన సమయంలో కేంద్రాన్ని ఇరుకున పెట్టేందుకా అన్నట్లుగా తీసుకున్న ఈ రిజర్వేషన్ల అంశానికి కేంద్రం నుంచి సహకారం లభించడం అసాధారణమని ప్రతి ఒక్కరు అంచనా వేయగలరు. చంద్రబాబు ఉద్దేశ్యాన్ని కేంద్రం మరోలా అర్ధం చేసుకుంటే మిత్ర పక్షాలుగా ఉన్నప్పటికి శత్రువుల కంటే ఎక్కువగా కమ్యూనికేషన్ గ్యాప్ మెయింటైన్ చేస్తున్న టిడిపి, బిజెపిల మధ్య మరింత అగాధం పెరగడం ఖాయం.

 ముందు ముందు గడ్డుకాలమేనా?

ముందు ముందు గడ్డుకాలమేనా?

పోలవరానికి కేంద్రం నుంచి ప్రతికూలత, మిత్రపక్షమైన బిజెపితో సఖ్యత లేకపోవడం, మోడీతో వైరం వ్యక్తిగత స్థాయికి చేరుకోవడం, కాపు రిజర్వేషన్లతో బిసిలు దూరమయ్యే పరిస్థితి, కాపుల రిజర్వేషన్లలో పురోగతి లేకపోతే వారి నుంచి ఎదురయ్యే ఒత్తిడి, మళ్లీ విభజన హామీల సాధన కోసం ఆందోళనలు ఊపందుకోవడం, ఈ సమస్యలన్నీ ఏకకాలంలోనే ఎదుర్కోవాల్సి రావడం...ఇవీ చంద్రబాబు ముందు ముందు ఎదుర్కోబోయే సవాళ్లు...మరి వీటన్నిటిని ఈ రాజకీయ చాణిక్యుడు ఎలా ఎదుర్కొంటారో వేచి చూద్దాం...

 ముందు ముందు ఏం జరగొచ్చు...

ముందు ముందు ఏం జరగొచ్చు...

కాపు, వాల్మీకి, బోయలకు రిజర్వేషన్లు ఇవ్వడం ద్వారా చంద్రబాబు సమస్యల తేనెతుట్టెను కదిపారా? ఈ నిర్ణయం ద్వారా తాను కోరుకున్నట్లు సమస్యలన్నీ తేనెటీగల్లాగా ఎగిరిపోయి ఓటు బ్యాంకు అనే తేనెను తన ఖాతాలో వేసుకుంటారా? లేక పరిస్థితి అందుకు భిన్నంగా రెంటికి చెడ్డ రేవడిలా మారుతుందా? అనే ప్రశ్నలకు ఎక్కువ కాలం వేచి చూడకుండానే సమాధానాలు త్వరలోనే లభించవచ్చంటున్నారు రాజకీయ పరిశీలకులు.

English summary
amaravathi: Brief Analysis on Kapu Reservation Politics in AP by oneindia .The Andhra Pradesh legislature unanimously passed the Kapu reservation Bill, 2017, to extend 5 per cent reservation to Kapus under the backward classes (BCs) category. In this back ground BC communities stage a protest opposing the government's decision of extending quota to Kapus under the BC category.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X