చంద్రబాబుకు డీకే శివకుమార్ ఆత్మీయ స్వాగతం-బెంగళూరు ఎయిర్ పోర్టులో ఆసక్తికర పరిణామం..
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాలు ఏకమయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఏ చిన్న పరిణామం చోటు చేసుకున్నా దాన్ని ఎన్నికల కోణంలోనే చూడాల్సిన పరిస్దితి. ఈ నేపథ్యంలో ఇవాళ బెంగళూరు ఎయిర్ పోర్టులో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కర్నాటక రాజధానికి ఓ కార్యక్రమం కోసం వెళ్లిన చంద్రబాబును అక్కడి కాంగ్రెస్ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ రిసీవ్ చేసుకున్నారు.

ఇవాళ చంద్రబాబు బెంగళూరు టీడీపీ ఫోరం మీటింగ్ లో పాల్గొనేందుకు అక్కడికి వెళ్లారు. బెంగుళూరు హెచ్ఏఎల్ ఎయిర్ పోర్టు కు చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు టీడీపీ నేతల కంటే ముందే కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వెళ్లి ఆహ్వానం పలికారు. అంతటితో ఆగకుండా చంద్రబాబుతో అక్కడే కాసేపు ముచ్చటించారు. వీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారో బయటికి రాలేదు. అయితే కాంగ్రెస్ లో ప్రస్తుతం ట్రబుల్ షూటర్ గా ఉన్న డీకే శివకుమార్ టీడీపీ అధినేత చంద్రబాబును ఇలా రిసీవ్ చేసుకోవడం, కాసేపు మాట్లాడటం మాత్రం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఏపీలో గతంలో వైసీపీకి వ్యూహకర్తగా ఉన్న ఐప్యాక్ అధినేత ప్రశాంత్ కిషోర్ తాజాగా చంద్రబాబును వచ్చి కలిశారు. ఇప్పుడు బెంగళూరు ఎయిర్ పోర్టులో కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ స్వయంగా ఆహ్వానం పలికారు. మరోవైపు డీకే శివకుమార్ కు సన్నిహితురాలైన వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తాజాగా చంద్రబాబు తనయుడు నారా లోకేష్ కు క్రిస్మస్ గిఫ్ట్ లు పంపారు. దీనిపై లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. దీంతో ఈ పరిణామాలన్నీ ఎటువైపు దారి తీయబోతున్నాయనే చర్చ జరుగుతోంది.
ఏపీలో బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన ఇప్పుడు టీడీపీకి అత్యంత సన్నిహితంగా మారిపోయింది. అంతే కాదు వచ్చే ఎన్నికల్లో వీరిద్దరికి బీజేపీ మద్దతివ్వాల్సిన పరిస్ధితి ఏర్పడింది. ఈ తరుణంలో కాంగ్రెస్ ను కలుపుకుని విపక్ష కూటమి తయారు చేసుకునేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో డీకే శివకుమార్ ఆయన్ను బెంగళూరు ఎయిర్ పోర్టులో కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.












Click it and Unblock the Notifications