టీడీపీ, జనసేనతో బీజేపీ పొత్తు ఖాయమా - కర్ణాటక ఎన్నికల ఎఫెక్ట్...!?
కర్ణాటక ఫలితాలు వచ్చేసాయి. ఇప్పుడు ఈ ఫలితాలు తెలుగు రాష్ట్రాలపై పరోక్షంగా ప్రభావం చూపున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ మరి కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్ వర్సస్ బీజేపీ అన్నట్లుగా రాజకీయ యుద్దం సాగుతోంది. ఏపీలో బీజేపీతో కలిసి ప్రయాణం చేయాలని టీడీపీ-జనసేన కోరుకుంటున్నాయి. బీజేపీ నుంచి ఇప్పటి వరకు స్పష్టత లేదు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తరువాత ఈ రెండు పార్టీలతో కలవటం పైన బీజేపీ నిర్ణయం ఎలా ఉండబోతోంది.
కర్ణటక ఫలితాలు..ఏపీలో పొత్తులు: బీజేపీ కర్ణాటకలో ఓటమి పాలైంది. సార్వత్రిక ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ ఈ ఓటమి పార్టీకి నష్టంగా మారనుంది. ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పాత్ర కొంత కాలంగా కీలకంగా మారుతోంది. తెలంగాణలో అధికార పార్టీ బీఆర్ఎస్ తో సై అంటోంది. ఈ సమయంలో ఏపీలో జరిగే ఎన్నికల్లో టీడీపీ, జనసేన బీజేపీతో పొత్తు కోరుకుంటున్నాయి. ఇప్పటికే చంద్రబాబ పరోక్షంగా.. పవన్ కల్యాణ్ ప్రత్యక్షంగా బీజేపీకి ప్రతిపాదనలు అందించాయి. బీజేపీ నుంచి మాత్రం స్పందన లేదు. ఇప్పుడు కర్ణాటక ఎన్నికలు పూర్తి కావటంతో తెలుగు రాష్ట్రాల పైన బీజేపీ ఫోకస్ పెడుతుందని పార్టీ నేతలు చెబుతున్నారు. అందులో భాగంగా ముందుగా పొత్తుల పైన క్లారిటీ ఇవ్వనున్నారు.

టీడీపీతో బీజేపీ కలుస్తుందా: కర్ణాటకలో ఎదురు దెబ్బ తగలటంతో దక్షిణాదిలో తెలుగు రాష్ట్రాల్లో బలం పెంచుకోవటం పైన బీజేపీ ఫోకస్ చేయనుంది. అందులో భాగంగా స్థానికంగా బలంగా ఉన్న పార్టీలతో పొత్తు దిశగా ఆలోచన చేస్తుందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే, పొత్తు ద్వారా రాజకీయంగా బీజేపీకి నష్టమా లాభమా అనే కోణంలో బీజేపీ నాయకత్వం ఆలోచన చేస్తోంది. తెలంగాణలో తాము సహకరిస్తామని టీడీపీ, జనసేన ముందుకు వచ్చినా... అక్కడ పొత్తు కుదుర్చుకుంటే కేసీఆర్ కు అస్త్రంగా మారుతుందని తెలంగాణ బీజేపీ నేతలు చెబుతున్నారు. అదే సమయంలో ఏపీలో బీజేపీతో ఈ రెండు పార్టీలు కలిస్తే రాజకీయంగా పెద్దగా లాభం లేకపోయినా వైసీపీని ఏకం చేయటానికి.. ఎలక్షన్ మేనేజ్ మెంట్ లో బీజేపీ కేంద్ర నాయకత్వం నుంచి మద్దతు లేకుండా చేయాలనేది చంద్రబాబు..పవన్ కల్యాణ్ వ్యూహం.

బీజేపీ ఆలోచన మారేనా: బీజేపీ దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక తరువాత తెలంగాణ కీలకంగా భావిస్తోంది. అక్కడ పొత్తులు ఉండవని ఆ పార్టీ రాష్ట్ర నేతలు ఇప్పటికే పదే పదే చెబుతున్నారు. అసలు టీడీపీతో కలవాల్సిన అవసరం లేదంటున్నారు. జనసేనతో ఇప్పటికే పొత్తుతో ఉన్నా సాధించింది ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికిప్పుడు మేలు జరగకపోయినా భవిష్యత్ లో పార్టీ ఎదగాలంటే త్రిపుర తరహాలో గ్రౌండ్ లెవల్ నుంచి పార్టీని బలోపేతం చేయటమే మార్గమని సీనియర్లు పేర్కొంటున్నారు. టీడీపీ స్థానం ఎప్పటికైనా ఏపీలో ఆక్రమించాలనేది బీజేపీ ఎత్తుగడ. ఈ సమయంలో బీజేపీ కలిసివస్తూ మూడు పార్టీలు..లేకపోతే తమ రెండు పార్టీలు అనే తరహాలో పవన్ నిర్ణయం కనిపిస్తోంది. దీంతో, ఇప్పుడు బీజేపీ ఈ రెండు పార్టీలతో కలుస్తుందా లేదా అనేది మరో వారం రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications