తిరుపతి ప్రజలకు పిలుపునిచ్చిన టీటీడీ
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం నాడు 66,441 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 20,639 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.12 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో రెండు కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది నుంచి 10 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లల్లో వేచివున్న భక్తులకు శ్రీవారి సేవకులు అల్పాహారం, మంచినీరు, పాలు అందజేశారు.

కార్తీక మాసాన్ని పురస్కరించుకుని టీటీడీ- హిందూ ధార్మిక పరిషత్ ఓ భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. ఈ నెల 18వ తేదీన రాత్రి కార్తీక మహా దీపోత్సవం, శ్రీ మహాలక్ష్మి పూజ కార్యక్రమాన్ని నిర్వహించనున్నాయి. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం పరేడ్ మైదానం దీనికి వేదిక. దీనికోసం విస్తృత ఏర్పాట్లను చేపట్టారు అధికారులు.
ఇందులో భాగంగా మహిళలుదీపాలు వెలిగించడానికి వీలుగా దీపపు దిమ్మెలను ఏర్పాటు చేస్తోన్నారు. నేతి వత్తులను అందుబాటులో ఉంచనున్నారు. పరేడ్ గ్రౌండ్ మొత్తం తివాచీలు పరచనున్నారు. అలాగే- ఒక్కో దీపపు దిమ్మె వద్ద ఒక తులసి మొక్కను ఉంచనున్నారు.

ఇందులో పాల్గొన్న ప్రతి మహిళకూ ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం టీటీడీ అధికారులు తులసీ మొక్కలను అందిస్తారు. టిటిడి పరిపాలనా భవనం ప్రధాన ద్వారాల నుంచి ఆవరణం మొత్తం అరటి చెట్లు, పూలు, విద్యుద్దీపాలతో అలంకరించనున్నారు. ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో మైదానంలో బ్యారికేడ్లు ఏర్పాటు చేస్తారు.
ఈ ఏర్పాట్లపై టీటీడీ జేఈవో వీరబ్రహ్మం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్తీక మహా దీపోత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో పిలుపునిచ్చారు. ఈ అతిపెద్ద ఆధ్యాత్మికోత్సవంలో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications