ప్లీజ్! చంపకు రా.. అనురాధ కన్నీళ్లు, బురఖా తీసి చింటూ ఊచకోత?: విచారణలో షాకింగ్
చిత్తూరు: మేయర్ కటారి అనురాధ, ఆమె భర్త మోహన్‌ల దారుణ హత్యలో మేనల్లుడు చంద్రశేఖర్ అలియాస్ చింటూ పాత్ర ఉన్నట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారని తెలుస్తోంది. చింటూతో పాటు కర్ణాటక రాష్ట్రం ముల్‌బాగల్‌కు చెందిన వెంకటాచలపతి, చిత్తూరు నగరం గంగనపల్లెకు చెందిన మంజు, వెంకటేష్, జయప్రకాష్ రెడ్డి ఉన్నట్లు గుర్తించారు.
ఈ ఐదుగురు పథకం ప్రకారం రెక్కీ నిర్వహించి మంగళవారం హత్యోదంతానికి తెగబడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. చింటూతో పాటు మరో ఇద్దరు కూడా బురఖా ధరించి కార్పొరేషన్ కార్యాలయానికి ఫిర్యాదుదారుల్లా వెళ్లినట్లు తెలిసింది.
Photos: మేయర్ అనూరాధ దంపతుల హత్య
ఎవరూ గుర్తుపట్టని విధంగా మహిళలు ఉపయోగించే హ్యాండ్ బ్యాగ్‌లను భుజానికి తగిలించుకుని వెళ్లి మేయర్ ఛాంబర్‌లోకి చొరబడి, మేయర్‌పై పిస్టల్‌ను ఎక్కుపెట్టగా.. చంపొద్దు, చంపొద్దు అంటూ ఆమె ప్రాధేయపడినా పిస్టల్‌తో కాల్చి చంపినట్లు పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

మోహన్ పరుగెత్తేందుకు ప్రయత్నించారు. అతడిని వెంటాడి మరీ హత్య చేశారని తెలిసింది. చింటూనే దగ్గరుండి నడిపించినట్లు వెలుగు చూసిందని తెలుస్తోంది. హత్యకు పాల్పడిన ఐదుగురు పారిపోతూ ముల్‌బాగల్‌కు చెందిన వెంకటాచలపతి, గంగనపల్లెకు చెందిన మంజూ అనే ఇద్దరు పోలీసు స్టేషన్‌లో లొంగిపోగా, గంగనపల్లెకు చెందిన జయప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి కూడా అదే రోజు సాయంత్రం చిత్తూరు తాలూకా పోలీసుల ఎదుట లొంగిపోయారు.
విచారణలో వీరు కీలకమైన అంశాలు వెలుగు చూసినట్లుగా తెలుస్తోంది. చింటూ, అతనికి డ్రైవర్, సహాయకుడుగా ఉండే వెంకటేష్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసు విచారణలో చిత్తూరు పోలీసు ఎదుట లొంగిపోయిన ముగ్గురు నిందితులను గత రెండు రోజులుగా విచారిస్తున్నారు.
మేయర్, ఆమె భర్తను హత్య చేయడానికి పక్కా ప్రణాళిక రూపొందించినట్లు లొంగిపోయిన నిందితుల విచారణలో వెలుగు చూసింది. జంట హత్య అనంతరం ఐదుగురు పోలీసుల ఎదుట లొంగిపోవాలని నిర్ణయించుకున్నా పరిస్థితులు అనుకూలించకపోవడంతో ముగ్గురు లొంగిపోగా, ఇద్దరు పారిపోయినట్లుగా వార్తలు వస్తున్నాయి. హత్య కేసులో చింటూను ఏ1గా పోలీసులు చేర్చారని తెలుస్తోంది.
మేయర్ అనురాధ దంపతులను చింటూనే చంపాడని ప్రత్యక్ష సాక్షులు కూడా చెబుతున్నారని తెలుస్తోంది. చింటూనే స్వయంగా రావడం చూసిన అనురాధ.. 'వద్దురా.. వదిలేయరా..' అని వేడుకున్నా తూటాల వర్షం కురిపించారని చెబుతున్నారు. ఆమె కన్నీళ్లు పెట్టుకున్నా చింటూ కనికరించలేదట.
హ్యాండ్ బ్యాగ్‌లో తెచ్చుకున్న తుపాకీని బయటకు తీసి, నేరుగా మేయర్ అనురాధ వద్దకు వెళ్లాడు. అప్పటి దాకా ముఖానికి బురఖా వేసుకున్న చింటూ... దానిని తీసేశాడు. మేనల్లుడే చంపేందుకు రావడం చూసి అనురాధ నిశ్చేష్టురాలయిందని, చేతులు జోడించి చంపవద్దని వేడుకుందని తెలుస్తోంది.
అతడి పాదాలు పట్టుకోవడం కోసం కుర్చీలోంచి కిందకు జారారని, అయినా వదిలిపెట్టకుండా తలకు గురిపెట్టి రెండు రౌండ్లు కాల్పులు జరిపాడని చెబుతున్నారు. ఓ తుటా తలను ఛిద్రం చేయగా, మరో తూటా తలలోనే ఉండిపోయింది. మిగతా నలుగురితో కలిసి మోహన్‌ని వెంటాడి చంపాడు.












Click it and Unblock the Notifications