సీఎం వైఎస్ జగన్ పై కత్తి మహేష్ విమర్శలు... అప్పుడు చంద్రబాబు చేసిన పనే ఇప్పుడు జగన్ కూడా అంటూ
Recommended Video
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఎన్నికల హామీలలో భాగంగా ఇచ్చిన నవరత్నాల అమలుపై దృష్టి పెట్టారు . రాష్ట్రం ఆర్ధిక ఇబ్బందుల్లో చాలా కష్టాల్లో ఉన్నా తాను అందిస్తానని చెప్పిన పథకాలను అందించి తీరుతున్నారు. అలాంటి ఎన్నికలహామీ అయిన 'అమ్మ ఒడి'పథకాన్ని జనవరి 9న సీఎం జగన్ చిత్తూరులోలాంఛనంగా ప్రారంభించనున్నారు. అయితే ఎప్పుడూ జగన్ ఏ పని చేసినా మెచ్చుకునే సినీ విమర్శకుడు కత్తి మహేష్ ఈ సారి అమ్మ ఒడి విషయంలో సీఎం జగన్ నిర్ణయాన్ని తప్పు పట్టారు. తీవ్రంగా విమర్శించారు.

బ్యాంకు ఖాతాలో 15 వేలు జమచేసేలా ‘అమ్మ ఒడి’ పథకం... విమర్శలపాలు
ఆర్ధిక ఇబ్బందులతో చదువుకు ఎవరూ స్వస్తి చెప్పకూడదని భావించిన సీఎం జగన్ బడికి పంపే ప్రతి తల్లి బ్యాంకు ఖాతాలో 15 వేలు జమచేసేలా ‘అమ్మ ఒడి' పధకాన్ని అమలు చెయ్యనున్నారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి . ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అమ్మ ఒడి పథకం అమలు కోసం రూ.6,450 కోట్లు కేటాయింపు చేసింది ఏపీ ప్రభుత్వం . మొదట స్కూలు విద్యార్థులకు అమలుచేయాలని భావించినప్పటికీ ఆ తర్వాత ఇంటర్మీడియట్ విద్యార్థులకూ అమ్మ ఒడిని వర్తింపచేశారు.అయితే ఇప్పుడు ఈ పథకం విమర్శల పాలవుతుంది.

ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను ఏపీ సర్కార్ పక్కదారి పట్టిస్తుందన్న కత్తి మహేష్
విద్యార్థులు తల్లులకు ఆర్ధిక తోడ్పాటు అందించే ఈ కార్యక్రమం అమలు కోసం ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను ఏపీ సర్కార్ పక్కదారి పట్టిస్తుందని సినీ విమర్శకుడు కత్తి మహేష్ ఏపీ సర్కార్ పై మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా అమ్మ ఒడి పథకం నిధుల వ్యవహారం పై పోస్ట్ చేసిన కత్తి మహేష్ జగన్ చేస్తున్న పని తప్పని పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు పాలనలో , టీడీపీ హయాంలో కూడా ఎస్సీల అభ్యున్నతి తీవ్రంగా అడ్డుకున్నారని చెప్పిన కత్తి మహేష్ ఇప్పుడు జగన్ కూడా చంద్రబాబులానే ప్రవర్తిస్తున్నారని చెప్పారు.

ఎస్సీ కార్పొరేషన్ నిధులను ప్రభుత్వం ఇతర పథకాలకు కేటాయించటంపై ఆగ్రహం
అంతే కాదు అమ్మ ఒడి కోసం ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను మళ్లించటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని చెప్పారు. ఈ విధానాలను ఇకనైనా కొనసాగించరాదని కత్తి మహేష్ సూచించారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల్ని ‘అమ్మఒడి' పథకానికి వినియోగించాలంటూ ఏపీ సర్కార్ జారీ చేసిన జీవోను ఈ మేరకు ఫేస్‌బుక్‌లో ఆయన పోస్ట్ చేశారు. ఎస్సీ కార్పొరేషన్ నిధులను ప్రభుత్వం ఇతర పథకాలకు కేటాయించడంపై ప్రతిపక్షాలు సైతం ప్రశ్నిస్తున్నాయి. బలహీన వర్గాల నిధులను వారికే వినియోగించి ఎస్సీల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేస్తున్నారు .అయితే కత్తి మహేష్ జగన్ ను ఇలా విమర్శించటం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ అయ్యింది.












Click it and Unblock the Notifications